ఏపీలో నిత్యగర్జనలు..! ఎందుకోసం.. ఎవరికోసం..?
ఆంధ్రప్రదేశ్ లో గర్జనల కాలం నడుస్తోంది. ఈ నెలలోనే విశాఖ గర్జన రేకెత్తించిన హడావుడి, రచ్చ అందరికీ తెలుసు. ఇప్పుడు మరో గర్జన సిద్ధమవుతోంది. రేపు తిరుపతిలో గర్జన నిర్వహించేందుకు సిద్ధమవుతోంది వైసీపీ. రాజధానుల వికేంద్రీకరణకు మద్దతుగా… సీమ అభివృద్ధి కోసం ఈ గర్జన నిర్వహించబోతున్నట్టు ఆ ప్రాంత వైసీపీ నేతలు వెల్లడించారు. మొన్న విశాఖ.. రేపు తిరుపతి.. అసలు ఈ గర్జనల వెనుక ఉన్న ఉద్దేశమేంటి.. వైసీపీ ఈ గర్జనలను ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.. లాంటి ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని అంశం పీటముడిలా మారింది. దీన్ని విప్పే నాథుడెవరూ కనిపించట్లేదు. రాజధానులపై అన్ని పార్టీలదీ ఒక మాటైతే అధికార వైసీపీది మాత్రం మరో మాట. అధికారంలో ఎవరుంటారో వాళ్లు చెప్పేదే వేదం కాబట్టి ఇప్పుడు అమరావతి అంశం చర్చనీయాంశమైంది. అమరావతితో పాటు 3 రాజధానులు ఏర్పాటు చేయాలనేది వైసీపీ సిద్ధాంతం. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో 3 రాజధానులను ఏర్పాటు చేయడం ద్వారా ఆ 3 ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందుతాయనేది వైసీపీ చెప్తున్నమాట. అయితే అమరావతి ప్రాంతవాసులు మాత్రం వైసీపీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. 30వేలకు పైగా ఎకరాల భూములను రాజధానికోసం ఇచ్చామని.. ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి చేయకుండా మరోచోటికి తరలిస్తామంటే ఒప్పుకునేది లేదని వాళ్లు తేల్చి చెప్తున్నారు. ఇప్పుడీ అంశం కోర్టులో ఉంది.
రాజధాని అంశం కోర్టులో ఉండగానే అధికార వైసీపీ మాత్రం అధికార వికేంద్రీకరణే తమ విధానమని స్పష్టం చేసింది. ఇందుకు 3 రాజధానులు ఏర్పాటు చేయడమే మార్గమని చెప్తోంది. అందుకోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేసింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆదేశించింది. టీడీపీ, జనసేన, బీజేపీ లాంటి పార్టీలు అమరావతే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే అక్కడ రాజధాని ఉంటే ఒక్క ఏరియానే అభివృద్ధి చెందుతుందని, ఒక కులానికి చెందిన వారికి మాత్రమే మేలు జరుగుతుందని వైసీపీ నేతలు చెప్తున్నారు. అందుకే విశాఖ, కర్నూలు, అమరావతిలో రాజధానులు ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందుతాయని వివరిస్తోంది. ఇదే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకురావాలని పార్టీ నేతలను ఆదేశించింది.
మూడు పార్టీలు ఒకవైపు, అధికార పార్టీ ఒకవైపు ఉండగా రాజధాని అంశం కోర్టులో ఉంది. కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో తెలీదు. ఒకవేళ తమ 3 రాజధానుల విధానానికి మద్దతుగా తీర్పు వస్తే హ్యాపీ.. తమ మాటే నెగ్గిందని.. న్యాయం గెలిచిందని వైసీపీ చెప్పుకోవచ్చు. ఒకవేళ అలా కాకుండా అమరావతికి అనుకూలంగా తీర్పు వస్తే.. దానిపై మళ్లీ పైకోర్టుకు వెళ్లాలని వైసీపీ ఆలోచిస్తోంది. అదే సమయంలో అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టసవరణకోసం కేంద్రానికి పంపించాలని భావిస్తోంది. ఇదంతా జరగాలంటే చాలా సమయమే పట్టొచ్చు. అప్పటి వరకూ ఈ అంశం యాక్టివ్ గా ఉండాలంటే ఇలాంటి గర్జనలు చేయడమే మార్గం. అందుకే గర్జనల ద్వారా తమ 3 రాజధానుల విధానాన్ని ప్రజల్లో యాక్టివ్ లా ఉండేలా చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది.













