Jagan Case : జగన్ అక్రమాస్తుల కేసు.. ఈడీ దెబ్బతో వైసీపీలో గుండెల్లో రైళ్లు!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి (YS Jagan) ఎదుర్కొంటున్న అక్రమాస్తుల కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) జగన్కు సంబంధించిన సుమారు రూ.800 కోట్ల విలువైన ఆస్తులను, అలాగే దాల్మియా సిమెంట్స్ కు (Dalmia Cements) చెందిన రూ.793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ (ED Attach) చేసింది. 14 ఏళ్లుగా నీరసంగా సాగుతున్న ఈ కేసులో ఈ చర్య ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
2004-2009 మధ్య తన తండ్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ అక్రమంగా ఆస్తులు సమకూర్చుకున్నారనే ఆరోపణలతో ఈ కేసు మొదలైంది. 2011లో కాంగ్రెస్ నేత శంకర్ రావు (Shankar Rao) దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) ఆదేశాలతో సీబీఐ (CBI) ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. జగన్ తన వ్యాపార సామ్రాజ్యమైన జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్, ఇందిరా టెలివిజన్, జనని ఇన్ఫ్రా వంటి సంస్థలలోకి పలు కంపెనీలు, వ్యక్తుల నుంచి అక్రమంగా పెట్టుబడులు సేకరించారనేది ప్రధాన ఆరోపణ. వైఎస్సార్ ప్రభుత్వం నుంచి ఈ సంస్థలు లబ్ది పొంది.. అందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయనేది ఈ కేసు ప్రధాన ఉద్దేశం. నిమ్మగడ్డ ప్రసాద్, రామ్కీ గ్రూప్, ఇండియా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్ వంటి సంస్థలు జగన్ కంపెనీలలో భారీ పెట్టుబడులు పెట్టాయని, బదులుగా వాటికి భూమి కేటాయింపులు, వాణిజ్య ప్రాజెక్టులు, గనుల లీజులు వంటి ప్రయోజనాలు కల్పించారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో సీబీఐ మొత్తం 11 చార్జ్ షీట్లు దాఖలు చేసింది. 2012లో జగన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించింది సీబీఐ. 16 నెలల తర్వాత ఆయన 2013లో బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు రూ.3,000 కోట్లకు పైగా ఆస్తులను అటాచ్ చేసింది. తాజాగా.. జగన్కు సంబంధించిన రూ.800 కోట్ల ఆస్తులతో పాటు, దాల్మియా సిమెంట్స్ కు చెందిన రూ.793 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. కడప జిల్లాలో సున్నపురాయి గనుల తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని, ఇందులో జగన్ రూ.180 కోట్ల మేర లబ్ధి పొందారని సీబీఐ 2013లో దాఖలు చేసిన చార్జ్ షీట్లో పేర్కొంది. తాజా చర్యతో కేసు మళ్లీ ఊపందుకుంది. తెలుగుదేశం పార్టీ (TDP) నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు వేగం పుంజుకుందని, ఇది రాజకీయ కక్షసాధింపు చర్యగా వైసీపీ భావిస్తోంది.
ఒకవేళ జగన్ ఈ కేసులో PMLA కింద దోషిగా తేలితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, అటాచ్ చేసిన ఆస్తుల జప్తు జరగవచ్చు. రాజకీయంగా జగన్ పై అనర్హత వేటు పడొచ్చు. అదే జరిగితే వైసీపీకి తీవ్ర ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటికే ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న వైసీపీ.. జగన్ లేకుండా నాయకత్వ శూన్యతను ఎదుర్కోవచ్చు. గతంలో పార్టీ కోసం తీవ్రంగా పని చేసిన తల్లి విజయమ్మ (Vijayamma), సోదరి షర్మిల (YS Sharmila) కూడా ఇప్పుడు జగన్ నుంచి విడిపోయారు. పార్టీని నడపాల్సిన బాధ్యత సతీమణి భారతి రెడ్డిపై (YS Bharathi Reddy) పడొచ్చు. జగన్ పై కేసులు బిగిసే కొద్దీ వైసీపీ కేడర్ దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ కేసులో తదుపరి పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను గణనీయంగా ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.













