ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమా..? జగన్ దూకుడు అందుకేనా?
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వస్తాయని చాలాకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు ఈ అంశంపై వైసీపీ సీరియస్ గా పరిశీలిస్తోందనే ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. వాస్తవానికి 2024 ఏప్రిల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే ఇంకా సుమారు ఏడాదిన్నర సమయం ఉంది. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే వచ్చే ఏడాదిలోనే ఎన్నికలు జరుగుతాయి. అందుకోసమే వైసీపీ ఇటీవలికాలంలో దూకుడు పెంచిందేమోననే అనుమానాలు తలెత్తుతున్నయి. ఇటీవలికాలంలో గడపగడపకు ప్రభుత్వం పేరుతో వైసీపీ ప్రజాప్రతినిధులంతా ప్రజల బాట పట్టారు. ఇవన్నీ ముందస్తు ఎన్నికల్లో భాగమేనేమో అనే ప్రచారం జరుగుతోంది.
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇవాళ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జగన్ చేసిన కొన్ని కామెంట్స్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారేమో అనే అనుమానాలు తలెత్తేలా చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరో ఏడాదిన్నిరలో ఎన్నికలు రాబోతున్నాయి.. అంటూనే… ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని జగన్ స్పష్టం చేశారు. ఈ రోజు నుంచే ఎన్నికలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతి ఇల్లూ తిరిగి మూడేళ్లలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు. దీన్ని బట్టి జగన్ ఎన్నికల పట్ల ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థమవుతోంది.
సాధారణంగా అధికారపక్షం చివరి ఏడాదిలో మాత్రమే ఎన్నికల గురించి ఆలోచిస్తుంటుంది. నాలుగేళ్లపాటు పూర్తిగా ప్రభుత్వ వ్యవహారాలపైనే దృష్టి పెడుతూ ఉంటుంది. కానీ జగన్ మాత్రం రెండేళ్ల ముందు నుంచే ఎన్నికలపై దృష్టి సారించారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు స్టార్ట్ చేశారు. ప్రజా ప్రతినిధులను ప్రజల్లోకి తరుముతున్నారు. తాను ప్రభుత్వంతో పాటు పార్టీ పైన కూడా అంతే స్థాయి టైమ్ కేటాయిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఐప్యాక్ టీమ్ తో రిపోర్టులు తెప్పించుకుని అందుకు తగ్గట్టు వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే ఒక దఫా గడపగడపకు ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఇప్పుడు రెండో విడత కొనసాగుతోంది. ప్రజల్లోకి వెళ్లని 27 మంది ఎమ్మెల్యేలకు గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు సీఎం జగన్. పద్దతి మార్చుకోకపోతే టికెట్ కష్టమేనని తేల్చి చెప్పారు.
జగన్ దూకుడు చూస్తుంటే ముందస్తు ఎన్నికలకు వెళ్తారేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని, పోలవరం అంశాలు వైసీపీకి పెద్ద సమస్యగా మారాయి. ఈ రెండింటినీ ఇప్పటికిప్పుడు క్లియర్ చేయడం చాలా కష్టం. రాజధాని అంశం కోర్టులో ఉంది. అయినా మూడు రాజధానులే తమ నినాదమంటోంది. ఒకవేళ మూడు రాజధానులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పునిస్తే వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతాయి. అలాగే 2022 డిసెంబర్ నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని వైసీపీ సర్కార్ మొదట్లోనే చెప్పింది. అయితే ఇప్పుడు అది కూడా అసంపూర్తిగానే ఉండిపోయింది. ఈ రెండు అంశాల వ్యతిరేకత నుంచి బయటపడాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఒక్కటే మార్గమనే భావన వైసీపీలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి.. ఏం జరుగుతుందో..!













