DSC: చంద్రబాబు బర్త్ డే కానుక.. ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్..!!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ (DSC) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఈ నోటిఫికేషన్, నిరుద్యోగులకు ఆశాకిరణంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) జన్మదినం సందర్భంగా ఈ నోటిఫికేషన్‌ను కానుకగా ప్రకటించడం విశేషం. 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వం (YCP Govt) అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) కూడా విడుదల చేయలేదు. వైసీపీ హయాంలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ కాలేదని.. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీదే అని లోకేశ్ (Nara Lokesh) పదే పదే విమర్శిస్తూ వచ్చారు. తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఇస్తామని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రకటించడం ద్వారా యువతలో విశ్వాసం నింపింది.
ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఎస్సీ (SC) వర్గీకరణకు అనుగుణంగా జారీ చేయడం మరో ప్రత్యేకత. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌ను (SC Reorganisation Ordinance) ఆమోదించిన తర్వాత, కొత్త రోస్టర్ ప్రకారం పోస్టుల కేటాయింపు జరిగింది. సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తూ, రాష్ట్రంలోని వివిధ వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పుకునేందుకు ఈ చర్య దోహదపడుతుంది. “ఎస్సీ వర్గీకరణ అమలుతోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించాం. ఇది సామాజిక న్యాయానికి నిదర్శనం” అని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా ఈ నోటిఫికేషన్‌ను ప్రకటించడం రాజకీయంగా కూడా గణనీయమైన అడుగుగా భావిస్తున్నారు. యువతకు చంద్రబాబు బర్త్‌డే కానుకగా టీడీపీ దీన్ని ఘనంగా ప్రచారం చేసుకుంటోంది. యువతలో టీడీపీ పట్ల సానుకూల వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తోంది. “మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నాం. ఇది మంచి ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం,” అని టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొంది. మరోవైపు వైసీపీ చేయలేని పనిని తాము 9 నెలల్లో చేసి చూపెట్టామని చెప్పుకుంటోంది. గత ఎన్నికల్లో టీడీపీ మెగా డీఎస్సీ హామీ ఇచ్చింది. దానిని నెరవేర్చడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయతను పెంచుకుంది.
ఈ నోటిఫికేషన్‌తో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి. రాష్ట్రంలో లక్షలాది మంది యువత డీఎస్సీ కోసం సన్నద్ధమవుతున్నారు. మెగా డీఎస్సీ ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చడం ద్వారా రాజకీయ, సామాజిక ఆధిక్యతను టీడీపీ సాధించింది. ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇవ్వడం, చంద్రబాబు జన్మదిన కానుకగా ఈ ప్రకటన చేయడం ఈ నోటిఫికేషన్‌కు ప్రత్యేక ఆకర్షణను జోడించాయి.













