ఆరునూరైనా హామీల అమలే బాబు ఫస్ట్ ప్రయారిటీ..!
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సహకరించట్లేదని.. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చేతులు ఎత్తేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీతో పాటు ఆ పార్టీ అనుకూల మీడియా ఈ విషయంలో విస్త్రృతంగా కథనాలు వండివారుస్తోంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అలాంటి కథనాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది. ఫేక్ కథనాలకు దూరంగా ఉండాలని మాత్రమే సూచిస్తోంది. ఏ ఒక్క హామీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. తప్పకుండా సూపర్ సిక్స్ అమలు చేసి తీరుతామని చంద్రబాబు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు సూపర్ సిక్స్ గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వాటితో పాటు ఎన్నికల ప్రచారం మొదలైన ఏప్రిల్ నుంచే రూ.4000 పెన్షన్ అందిస్తామని చెప్పారు. ఒకేసారి పెన్షన్లను భారీగా పెంచేయడంతో ఆ భారం మోయడం కష్టమని అందరూ అనుకున్నారు. అయితే జూన్ 12న చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టారు. కేవలం 18 రోజుల వ్యవధిలోనే జులై 1న పెంచిన పెన్షన్లను అందరికీ అందజేశారు. అది కూడా వాలంటీర్లు లేకుండా సచివాలయ వ్యవస్థ ద్వారానే అందించారు. ఆగస్టు 1న కూడా ఇలాగే సమర్థంగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు.
పెన్షన్లు మాత్రమే కాదు.. ఉద్యోగులకు గతంలో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేది. కానీ ఈసారి ఆగస్టు 1న ఉద్యోగులకు జీతాలు పడ్డాయి. దీంతో ఉద్యోగుల్లో సంతోషంతో పాటు ఆశ్చర్యం కలిగింది. మరోవైపు సూపర్ సిక్స్ లో భాగమైన విద్యాదీవెన ఇవ్వలేదని వైసీపీ విమర్శిస్తోంది. అంతేకాక పిల్లలందరికీ ఇవ్వట్లేదని.. వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తారని ప్రచారం చేయడం మొదలు పెట్టింది. అయితే లోకేశ్ వీటన్నటికి చెక్ పెడుతూ పిల్లలందరికీ విద్యా దీవెన అందిస్తామని చెప్పారు. ఈ నెలలోనే విద్యాదీవెన నిధులు విడుదల చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నా క్యాంటీన్లను కూడా ఆగస్టు 15 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ పలు సందర్భాల్లో చంద్రబాబు భయమేస్తోందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలను పట్టుకున్న వైసీపీ నేతలు.. చంద్రబాబు చేతులెత్తేశారని.. హామీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం మొదలు పెట్టారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇలాంటి వ్యాఖ్యలను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. పైగా తమ పని తాము చేసుకుపోతోంది. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం హామీలను అమలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. గతంలో చంద్రబాబుపై జగన్ ఇదే అంశాన్ని ఎత్తి చూపేవారు. చంద్రబాబు మాటిస్తారు కానీ అధికారంలోకి వచ్చాక పట్టించుకోరని. ఈసారి చంద్రబాబు అలాంటి అవకాశం జగన్ కు ఇవ్వకూడదనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే పక్కాగా అడుగులు ముందుకు వేస్తున్నారు.













