హామీల అమలు చంద్రబాబుకు కత్తిమీద సామేనా..?
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. గత వైసీపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో టీడీపీ, జనసేన, బీజేపీ జతకట్టిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు కూటమి ఈ విషయంలో సక్సెస్ అయింది. జగన్ ప్రభుత్వాన్ని ఓడించి ఘనవిజయంతో ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. జగన్ ప్రభుత్వం పూర్తిగా సంక్షేమాన్నే నమ్ముకుని ఐదేళ్లూ పాలన సాగించారు. అయినా ఓడిపోయారు. ఆయన్ను ఓడించేందుకు చంద్రబాబు అంతకుమించిన సంక్షేమం అమలు చేస్తామని విపరీతమైన హామీలు గుప్పించారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఆయన హామీలన్నింటినీ నెరవేర్చడంతో పాటు పలు పెండింగ్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జగన్ నేతృత్వంలోని వైసీపీని ఓడించేందుకు టీడీపీ ఏడాది ముందు నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్లింది. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో రూపొందించారు. యువతకు ఉపాధి అవకాశాలు లేకుంటే నెలకు రూ.3వేల భృతి, స్కూలుకు వెళ్లే ప్రతి పిల్లాడికి ఏడాదికి రూ.15వేలు, రైతుకు ఏటా రూ.20వేల ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు రూ.1500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటివి ఇందులో ఉన్నాయి. అలాగే వృద్ధాప్య పెన్షన్లను రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంపు లాంటివి ఇందులో ఉన్నాయి. ఇవన్నీ డబ్బుతో కూడుకున్న అంశాలే. వీటన్నింటికి నిధులు సమకూర్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
హామీల సంగతి పక్కన పెడితే అమరావతి, పోలవరం లాంటి ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుపై ఉంది. ఈ రెండూ ఆంధ్రప్రదేశ్ కు ఎంతో కీలకమైనవి. గత ఐదేళ్లలో అమరావతిని పూర్తి చేయకపోవడంతో వైసీపీ అధికారంలోకి రాగానే 3 రాజధానులను తెరపైకి తెచ్చి గందరగోళానికి కారణమైంది. అలాగే పోలవరం కూడా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఈ రెండు పూర్తి చేయగలిగితే చంద్రబాబు సక్సెస్ సాధించినట్లవుతుంది. ఇవికాకుండా రాష్ట్రాభివృద్ధి పైన కూడా చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. గత జగన్ ప్రభుత్వం అభివృద్ధిని అస్సలు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి.
ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి ఇప్పుడు చంద్రబాబుకు రెండు కళ్లు. వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. పైగా మేనిఫెస్టోలో చంద్రబాబు అలవికాని హామీలిచ్చారనే అపవాదులున్నాయి. వాటిని పూర్తి చేయగలిగితేనే చంద్రబాబు మళ్లీ ఓట్లడిగేందుకు అర్హత సాధించినట్లవుతుంది. పైగా చంద్రబాబు చెప్తాడు కానీ చేయడు.. మేం మాత్రం చెప్తే కచ్చితంగా చేస్తాం.. మాట తప్పం మడమ తిప్పం అనే డైలాగులతో వైసీపీ ఎప్పటి నుంచో విమర్శిస్తోంది. విలువలు – విశ్వసనీయం తమ పేటెంట్ అని చెప్పుకుంటోంది. ఒకవేళ చంద్రబాబు వీటిని అమలు చేయలేకపోతే వచ్చే ఎన్నికల సమయంలో వైసీపీ కచ్చితంగా వీటిని ప్రచారాస్త్రాలుగా వాడుకుంటుంది. ఆ అవకాశం వైసీపీకి ఇవ్వకూడదనుకుంటే చంద్రబాబు వీటిని కచ్చితంగా అమలు చేసి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి వీటన్నిటినీ అమలు చేసేందుకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారనేది వేచి చూడాలి.













