చంద్రబాబు చుట్టూ కేసుల వల..! ఇప్పట్లో బయటకు రావడం కష్టమేనా..?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఆయన్ను సీఐడీ అరెస్టు చేసింది. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రెండ్రోజులుగా ఆయన జైలులోనే గడుపుతున్నారు. చంద్రబాబుకు బెయిల్ తెచ్చేందుకు ఆయన తరపు న్యాయవాదులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటు ఏసీబీ కోర్టులో, ఇటు హైకోర్టులో పలు పిటిషన్లు వేసి ఆయన్ను వీలైనంత త్వరగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే చంద్రబాబును బయటకు రానివ్వకుండా జైలులోనే ఉండేలా చూసేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసింది సీఐడీ. ఇందులో చంద్రబాబే సూత్రధారి అని సీఐడీ చెప్తోంది. సీఐడీ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో ఆయన జైలుకు వెళ్లక తప్పలేదు. అయితే చంద్రబాబు చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారని.. కచ్చితంగా తమకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని టీడీపీ నేతలు చెప్తున్నారు. తమకు కోర్టుల్లో న్యాయం జరుగుతుందంటున్నారు. అందుకే చంద్రబాబుకు హౌస్ అరెస్ట్ విధించాల్సిందిగా ఓ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఆయనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా మరో పిటిషన్ హైకోర్టులో దాఖలైంది. వీటిపై న్యాయస్థానాలు నిర్ణయం వెలువరించాల్సి ఉంది.
అయితే చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. అనేక అక్రమాలకు పాల్పడిన చంద్రబాబుకు జైలే సరైన ప్రదేశమని.. ఆయన అక్కడే సురక్షితంగా ఉండగలుగుతారని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ లభిస్తే.. మరో కేసులో ఆయన్ను ఇరికించేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అమరావతి రింగ్ రోడ్ వ్యవహారంలో అవకతవకలపైన చంద్రబాబుపై ఇప్పటికే కేసు నమోదైంది. ఇందులో ఆయన ఏ1గా ఉన్నారు. ఈ కేసులోని మిగిలిన నిందితులంతా ఇప్పటికే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. చంద్రబాబు మాత్రం తెచ్చుకోలేదు. ఇప్పుడు ఈ కేసులో పీటీ వారెంట్ కోసం సీఐడీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వారెంట్ జారీ అయితే ఆయన్ను ఈ కేసులో రౌండప్ చేసేందుకు సీఐడీ సిద్ధమవుతోంది.
ఒకవేళ ఈ కేసులో కూడా చంద్రబాబుకు ఊరట లభిస్తే మరో కేసు కూడా చంద్రబాబు మెడకు వేలాడుతోంది. ఇటీవల అన్నమయ్య జిల్లా అంగళ్లులో ర్యాలీ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే గొడవలు జరిగాయని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో నిందితులుగా ఉన్న పలువురు టీడీపీ నేతలు ఇప్పటికీ కనిపించకుండా తలదాచుకుంటున్నారు. వాళ్లకోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో కూడా చంద్రబాబు ఏ1గా ఉన్నారు. ఇందులో కూడా చంద్రబాబును అరెస్టు చేసేందుకు పోలీసులు రెడీగా ఉన్నారు. ఇలా పలు కేసులు చంద్రబాబును చుట్టుముడుతున్నాయి. ఒకటి కాకపోయినా మరో దాంట్లో చంద్రబాబును ఇరికించేందుకు పక్కాగా స్కెచ్ వేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.













