చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ..! సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లేనా..?
ఆంధ్రప్రదేశ్ లో ఈసారి వైసీపీ సర్కార్ ను ఎలాగైనా ఓడించాలని టీడీపీ, జనసేన ట్రై చేస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీని వదిలి తప్పు చేశానని ఫీలవుతున్న జనసేనాని.. ఈసారి ఆ తప్పు చేయబోనని చెప్తున్నారు. జగన్ ను ఓడించేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమని పదే పదే ప్రకటిస్తున్నారు పవన్ కల్యాణ్. ఇందుకోసం ఇప్పుడు పొత్తుతో ఉన్న బీజేపీని సైతం వదులుకునేందుకు పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారు. ఇందుకోసం ఆయన వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. టీడీపీతో ఈసారి పొత్తు దాదాపు ఖాయమని అందరూ భావిస్తున్న వేళ పవన్ కల్యాణ్ .. టీడీపీతో అధినేత చంద్రబాబుతో భేటీ కావడం ఆసక్తి కలిగిస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్ వెళ్లి కలిశారు. దాదాపు గంటకు పైగా వాళ్లిద్దరూ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వాళ్లిద్దరూ చర్చించుకున్నట్టు సమాచారం. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబును కలవడం ఇదే తొలిసారి. దీంతో ఢిల్లీ పరిణామాలను పవన్ కల్యాణ్.. చంద్రబాబుతో షేర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానాన్ని కలిసి పొత్తులపై చర్చించేందుకు పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. అయితే మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో నడ్డాతో భేటీ అయ్యారు. టీడీపీతో కలిసి వెళ్లేందుకు బీజేపీ సిద్ధంగా లేదని.. జనసేనతో మాత్రం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కమలం పార్టీ హైకమాండ్ పవన్ కల్యాణ్ కు స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఢిల్లీ పరిణామాలను పవన్ కల్యాణ్ చంద్రబాబుకు వివరించినట్టు సమాచారం. బీజేపీని తమ కూటమిలోకి ఎలా తీసుకురావాలనేదానిపై వాళ్లిద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ కలసి రాకపోతే ఎలా ముందుకెళ్లాలి.. వైసీపీని ఓడించేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించాలి.. లాంటి అనేక అంశాలపై వాళ్లు మాట్లాడుకున్నట్టు సమాచారం. మరోవైపు.. సీట్ల సర్దుబాటుపైన కూడా వాళ్లిద్దరూ ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారని తెలుస్తోంది. జనసేనకు 25 సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారని చెప్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం 50 ఎమ్మెల్యే సీట్లు, 10 ఎంపీ సీట్లు అడుగినట్లు తెలుస్తోంది.
అయితే చంద్రబాబు మాత్రం వాస్తవాలను బేరీజు వేసుకుని సీట్ల సర్దుబాటు చేసుకుందామని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. బీజేపీ కలసి వస్తే ఎక్కువ ఎంపీ సీట్లు ఆ పార్టీకి ఇచ్చేందుకు రెండు పార్టీల నేతలు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. జనసేనకు 25-30 సీట్ల కంటే ఎక్కువ ఇస్తే రెండు పార్టీలకూ నష్టం జరుగుతుందని.. అది వైసీపీ గెలుపుకు దోహదపడుతుందనిచ చంద్రబాబు వివరించినట్టు తెలుస్తోంది. దీనికి పవన్ కల్యాణ్ కూడా అంగీకరించారని చెప్తున్నారు. దీన్ని బట్టి 25 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ స్థానాలకు పవన్ కల్యాణ్ చివరకు అంగీకరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.













