చంద్రబాబు అటూఇటూ కాకుండా పోయారా..?
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అరెస్టు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశం దేశంలో జరుగుతున్న సమయంలోనే చంద్రబాబును అరెస్టు చేయడం ద్వారా ఆయన దోషి అని ప్రపంచానికంతటికీ తెలియజెప్పే ప్రయత్నం జగన్ చేస్తున్నారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఒకప్పుడు దేశరాజకీయాలను శాసించిన చంద్రబాబు.. ఇప్పుడు కేవలం రాష్ట్రానికి మాత్రమే పరిమితం అయిపోయారు. ఇలాంటి క్లిష్ట సమయంలో జాతీయ పార్టీలేవీ ఆయన వెంట నడిచి వచ్చేందుకు ఏమాత్రం సిద్ధంగా లేవు. ఇది ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. రాత్రికి రాత్రే పరిణామాలు మారిపోవచ్చు. మన అనుకున్న వాళ్లు దూరమైపోవచ్చు. చంద్రబాబు విషయంలో అలా జరగకపోయినా ఆయన పరిస్థితి మాత్రం ఇప్పుడు అదే. తన అనుకున్నవాళ్లంతా దూరమైపోయారు. తన వెంట నడిచే ఒక్క జాతీయ పార్టీ కూడా ఇప్పుడు లేదు. ఇది టీడీపీ శ్రేణులను కలవరపెడుతోంది. ఒకప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్డీయే లాంటి కూటముల్లో టీడీపీ కీలక పాత్ర పోషించింది. జాతీయ రాజకీయాల్లో జాతీయ పార్టీలను మించి యాక్టివ్ గా ఉండేది. అయితే అదంతా గతం.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి నాలుగేళ్లు బీజేపీతో స్నేహం చేశారు చంద్రబాబు. ఆ తర్వాత బీజేపీకి కటీఫ్ చెప్పి ఆ పార్టీపైనే యుద్ధం ప్రకటించారు. అంతటితో ఆగకుండా బీజేపీ ప్రత్యర్థి కాంగ్రెస్ తో కలిసి కూటమి కట్టారు. అయితే రెండోసారి కూడా మోదీయే అధికారంలోకి రావడంతో చంద్రబాబు ప్లాన్ బెడిసికొట్టింది. అప్పటి నుంచి చంద్రబాబును పూర్తిగా దూరం పెట్టేసింది బీజేపీ. బాబు ఢిల్లీలో అడుగు పెట్టేందుకు దాదాపు నాలుగేళ్లు సమయం పట్టిందంటే ఆయన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబును నమ్మే స్థితిలో బీజేపీ అస్సలు లేదు.
మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా దాదాపు 28 పార్టీలు ఇండియా పేరుతో కూటమి ఏర్పాటు చేసి మోదీపై యుద్ధం ప్రకటించాయి. ఆ కూటమిలో కూడా చంద్రబాబు లేరు. కనీసం ఆ కూటమి నుంచి చంద్రబాబుకు పిలుపు కూడా లేదు. దీన్ని బట్టి విపక్షాలు కూడా చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేవని అర్థమవుతోంది. దీంతో అటు బీజేపీ కూటమిలోకానీ, ఇటు కాంగ్రెస్ కూటమిలో కానీ చంద్రబాబుకు స్థానం లేకుండా పోయింది. అరెస్టు లాంటి క్లిష్ట సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా నిలిచే ఒక్క పార్టీ కూడా లేదంటే ఆయన సిచ్యుయేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి చంద్రబాబు ఎలా బయటపడుతారో వేచి చూడాలి.













