లాస్ట్ ఛాన్స్ అంటున్న చంద్రబాబు..! సానుభూతికోసమేనా..?
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన పలు నియోజకవర్గాల్లో బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నిన్న చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీ నేతలను కాస్త కంగారు పెడుతున్నాయి. పెద్దాయన ఎందుకిలా మాట్లాడారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ మాత్రం తాము మొదటి నుంచి ఇదే విషయం చెప్తున్నామని.. చంద్రబాబుకు వచ్చే ఎన్నికలే చివరి ఎన్నికలని ఎద్దేవా చేస్తోంది.. ఇంతకూ చంద్రబాబు ఎందకలా మాట్లాడారు.?
కర్నూలు పర్యటనలో భాగంగా పత్తికొండలో చంద్రబాబు ప్రసంగించారు. గౌరవ అసెంబ్లీని కౌరవ సభగా మార్చారని చంద్రబాబు ఆరోపించారు. చివరకు తన భార్యను కూడా అవమానించారని.. ఈసారి తనను ఆశీర్వదించి గెలిపిస్తే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానని పునరుద్ఘాటించారు. లేకుంటే తనకు ఇవే చివరి ఎన్నికలని స్పష్టం చేశారు. ఒక్క చాన్స్ అని జగన్ అడగ్గానే అవకాశం ఇచ్చారని.. కానీ జగన్ రివర్స్ గేర్ లో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారని విమర్శించారు. తాను చేస్తున్నది ధర్మపోరాటం అని.. ప్రజలు వాస్తవాలు తెలుసుకుని ఆదరించాలని కోరారు. జగన్ వచ్చిన తర్వాత ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపులు నిర్వహిస్తూ బ్లాక్ మార్కెట్ దందా చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మూడు రాజధానులు ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. కనీసం రోడ్లు వేయలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడా అని ప్రశ్నించారు.
చంద్రబాబు వయసు ఇప్పుడు 72 ఏళ్లు.. 2024నాటికి 74 నాళ్లు వస్తాయి. ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెప్పడం వెనుక ఏదైనా వ్యూహముందా అని అనుమానిస్తున్నారు. వాస్తవానికి 80 ఏళ్లు దాటిన వారు కూడా మన దేశ రాజకీయాల్లో ఇప్పటికీ యాక్టివ్ గా ఉంటున్నారు. అలాంటిది ఫిజికల్ గా ఎంతో ఫిట్ గా ఉన్న చంద్రబాబు 72 ఏళ్లకే తనకు ఇవే చివరి ఎన్నికలని ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశా.. సానుభూతికోసం ఇలా మాట్లాడి ఉండొచ్చేమోనని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రాన్ని బతికించుకోవాలంటే తాను అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమని.. ఈసారి ఆ అవకాశం దక్కకపోతే రాష్ట్రం నష్టపోతుందనే ఫీలింగ్ ను ప్రజల్లోకి చొప్పించడం ద్వారా తనపట్ల సానుభూతి తెప్పించుకోవచ్చనే వ్యూహం చంద్రబాబు అనుసరించి ఉండొచ్చని భావిస్తున్నారు. గతంలో రాష్ట్రం విడిపోయినప్పుడు నవ్యాంధ్రను గాడిన పెట్టే బాధ్యత ప్రజలు తనకు అప్పగించారని చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీని దారుణంగా ఓడించారు ప్రజలు. ఇప్పుడు మళ్లీ లాస్ట్ ఛాన్స్ అనే నినాదాన్ని చంద్రబాబు లేవనెత్తుతున్నారు.
వైసీపీ మాత్రం తాము మొదటి నుంచి ఇదే చెప్తున్నామని ఎద్దేవా చేస్తోంది. చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరివని ఆ పార్టీ నేతలు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఆ ఎన్నికల్లో కూడా టీడీపీ అధికారంలోకి రాదని.. ఆ తర్వాత చంద్రబాబు వయసైపోతుందని.. పోటీ చేయబోరని వైసీపీ నేతలు ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఇవే తనకు లాస్ట్ ఎన్నికలని ప్రకటించడంతో వైసీపీకి ఆయుధం చిక్కినట్లయింది. చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ నినాదం ఆయన పట్ల సానుభూతి తెప్పిస్తుందా.. లేకుంటే వైసీపీకి ఆయుధంలా మారుతుందా.. అనేది వేచి చూడాలి.













