పొత్తులపై చంద్రబాబు మౌనం… ఏంటి సంగతి..?
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అంతుచిక్కని పరిస్థితి ఉంది. ఎన్నికలకు ఇంక 9 నెలలు మాత్రమే సమయం ఉండడంతో అన్ని పార్టీలూ ఫుల్ బిజీ అయిపోయాయి. ఎవరితో కలసి వెళ్లాలి.. ఎవరితో వెళ్తే ఎంత లాభం ఉంటుంది.. ఒంటరిగా వెళ్తే ఎలా ఉంటుంది.. లాంటి లెక్కలన్నీ వేసుకుంటున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగానే వెళ్తామని ఇప్పటికే చెప్పేసింది. ఇక టీడీపీ, జనసేన పొత్తులకోసం ప్రయత్నిస్తున్నాయి. అయితే అది వర్కవుట్ అవుతుందో తెలియట్లేదు. మరోవైపు బీజేపీకి ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఉంది. అయితే ఇన్నాళ్లూ జనసేన, బీజేపీతో పొత్తుకోసం వెంపర్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకో మౌనంగా ఉన్నారు. ఇది అంతుచిక్కడం లేదు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని ఓడించాలంటే కచ్చితంగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని గతంలోనే చంద్రబాబు పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈసారి జగన్ ను గద్దె దింపేందుకు ఎవరితోనైనా కలిసి పని చేస్తామని బహిరంగంగానే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబుతో రెండు సార్లు భేటీ అయ్యారు పవన్ కల్యాణ్. దీంతో ఆ రెండు పార్టీల పొత్తు దాదాపు ఖాయమని అర్థమైంది. అయితే వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని జనసేన కోరుకుంటోంది. అందుకే జనంలోకి వెళ్లి తమ సత్తా ఏంటూ చూపించి టీడీపీ నుంచి ఎక్కువ సీట్లు కొట్టేయాలనుకుంటోంది.
మరోవైపు బీజేపీ అండ ఉంటే చాలు ఈసారి జగన్ ను ఓడించగలమనే ధీమా చంద్రబాబులో కనిపిస్తోంది. అందుకోసం కమలం పెద్దల కటాక్షకోసం ఆపసోపాలు పడ్డారు. చివరకు అమిత్ షాయే స్వయంగా చంద్రబాబును ఢిల్లీ ఆహ్వానించి చర్చలు జరిపారు. దీంతో బీజేపీ – టీడీపీ మధ్య పొత్తు పొడవబోతోందని, అందుకే ఈ చర్చలు జరిగాయని అందరూ అనుకున్నారు. అయితే ఆ తర్వాత ఆ రెండు పార్టీల నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. అటు టీడీపీ కానీ, ఇటు బీజేపీ కానీ ఆ మీటింగ్ సారాంశం ఏంటనేది బయటకు వెల్లడించలేదు. దీంతో ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు.
అయితే ఇన్నాళ్లూ పొత్తులకోసం తెగ ప్రయత్నించిన చంద్రబాబు ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదు. పవన్ కల్యాణ్ ఎక్కువ సీట్లు అడుగుతారనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగానే చంద్రబాబు మౌనం పాటిస్తున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు బీజేపీతో పొత్తు మంచిది కాదని పార్టీ శ్రేణుల నుంచి సూచనలు వస్తున్నాయి. గతంలో నానా తిట్లు తిట్టి ఇప్పుడు మళ్లీ ఆ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం మంచిది కాదని సలహా ఇస్తున్నాయి. అన్నిటికీ మించి అన్ని పార్టీలూ బీజేపీకి అనుకూలంగా ఉన్నా రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదనే విమర్శలు ఉన్నాయి. పొత్తు పెట్టుకోకుండా అవసరమైతే ఎన్నికల తర్వాత అవగాహన కుదుర్చుకుంటే మంచిదని భావిస్తున్నాయి. అందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగానే కామ్ గా ఉంటున్నట్టు అర్థమవుతోంది.













