వైసీపీపై ఉమ్మడి పోరు.. చంద్రబాబు, పవన్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పొత్తులపై ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ కావడం మరోసారి పొత్తులపై చర్చ జరిగేందుకు ఆస్కారం కల్పించింది. ఈసారి టీడీపీతో జనసేన కలవడం ఖాయమనే ప్రచారం చాలాకాలం నుంచి బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే అడుగులు పడుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఏపీలో జగన్ నేతృత్వంలో అరాచక పాలన నడుస్తోందన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించేందుకు అన్ని పక్షాలను కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు. ఈ అంశంపై మిత్రపక్షమైన బీజేపీతో కూడా చర్చిస్తామన్నారు పవన్ కల్యాణ్
హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. సుమారు గంటకు పైగా జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. సమావేశం అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. ఏపీలో అరాచక పాలన రాజ్యమేలుతోందని విమర్శించారు. ఏపీలో చీకటి జీవోలను తీసుకొచ్చి విపక్షాలను అణచివేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయన్నారు. కుప్పంలో చంద్రబాబులాంటి సీనియర్ నేతను అడ్డుకోవడాన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు పవన్ కల్యాణ్.
గుంటూరు, కందుకూరు ఘటనలను చంద్రబాబు పోలీసుల కుట్రగా అభివర్ణించారు. సెక్యూరిటీ కల్పించడంలో ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారన్నారు. విపక్షాలు సమావేశం పెట్టుకోకూడదు కానీ ముఖ్యమంత్రి మాత్రం పరదాల మాటున సమావేశాలు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. 7 సార్లు గెలిచిన నా సొంత నియోజకవర్గానికి వెళ్లే అర్హత కూడా తనకు లేదా అని చంద్రబాబు నిలదీశారు. బ్రిటీష్ కాలం నాటి జీవో నెంబర్ 1ని తీసుకొచ్చి విపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించడం, దాడులు చేయడమే వైసీపీ లక్ష్యమన్నారు. ఇలాంటి వాటిపై పార్టీలు మాత్రమే కాదని, ప్రజాసంఘాలు మీడియా కూడా నిలదీయాలని పిలుపునిచ్చారు. జగన్ అరాచక పాలనపై గవర్నర్ తో పాటు కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు చంద్రబాబు.
తమ పార్టీల నేతలపై ప్రభుత్వం పెడుతున్న కేసులు, పెన్షన్లు తీసివేయడం, జగన్ అరాచక పాలన లాంటి అనేక అంశాలపై చర్చించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. జగన్ సంక్షేమ పాలన అందిస్తుంటే.. చంద్రబాబు ఇచ్చే కానుకలకోసం అన్ని వేల మంది ఎందుకొస్తారని ప్రశ్నించారు. ఈసారి తాము ఓడిపోతున్నామని వైసీపీకి తెలుసని.. అందుకే మమ్మల్నే అణచివేసే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. విపక్ష నేతలు ఫ్లెక్సీలు పెట్టకూడదు కానీ.. ముఖ్యమంత్రి బర్త్ డే సందర్భంగా వైసీపీ నేతలు ఫ్లెక్సీలు కట్టారని పవన్ కల్యాణ్ గుర్తు చేసారు. వైసీపీకో న్యాయం.. విపక్షాలకో న్యాయమా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది కాబట్టి ఎక్కడైనా పోటీ చేయవచ్చన్నారు పవన్ కల్యాణ్.
ఎన్నికల సమయంలో పొత్తులపై చర్చించుకుంటామన్నారు చంద్రబాబు. అయితే ఈసారి ఎలాగైనా వైసీపీ ప్రభుత్వాన్ని దించుతామని.. ఇందుకు అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్తామని ఇరువురు నేతలు వెల్లడించారు. దీన్నిబట్టి త్వరలోనే మిగిలిన పార్టీలతో కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించే అవకాశం కనిపిస్తోంది.













