వైసీపీపై బీజేపీ విమర్శల వెనుక వ్యూహముందా…?
నాలుగేళ్లుగా కేంద్రంలోని బీజపీతో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతోంది. రెండు పార్టీల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. కేంద్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బీజేపీ అడగకపోయినా తానున్నానంటూ ముందు నిలబడ్డారు వైసీపీ అధినేత జగన్. బీజేపీ కూడా వైసీపీ అడిగినవన్నీ చేస్తూ వస్తోంది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకపోయినా అంతకు మించిన బంధం వాటి మధ్య కొనసాగుతోంది. ఈ బంధం ఇలాగే కొనసాగుతుందని, మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో బీజేపీ అగ్రనాయకత్వం ఒక్కసారిగా వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.
మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తి కావడంతో ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, విశాఖపట్నంలలో ఈ సభలు ఏర్పాటు చేసింది. శ్రీకాళహస్తి సభకు జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, విశాఖ సభకు హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. వీళ్లిద్దరూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, ఇక్కడ చట్టం అమలు కావట్లేదని ఆరోపించారు. స్కాంలు తప్ప ఇక్కడేమీ జరగట్లేదని దుయ్యబట్టారు. కేంద్ర నిధులను పక్కదారి పట్టించారని విమర్శించారు.
బీజేపీ అగ్రనేతలే స్వయంగా వచ్చి జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇన్నాళ్లూ రాష్ట్ర బీజేపీ నాయకత్వం వైసీపీని విమర్శించేందుకు సాహసించలేదు. అగ్రనాయకత్వంతో జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉండడంతో విమర్శిస్తే ఏమంటారో ఏమోనని కిమ్మనకుండా ఉండిపోయారు. కానీ ఇపపుడు అమిత్ షాయే రంగంలోకి దిగి జగన్ ను కడిగిపారేయడంతో అసలేం జరుగుతోందో అర్థం కావట్లేదు. కొన్ని రోజుల కిందట టీడీపీ అధినేత చంద్రబాబును అమిత్ షా, నడ్డా ఢిల్లీ పిలిపించుకుని చర్చలు జరిపారు. టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్ధమైనందు వల్లే ఇప్పుడు వైసీపీని బీజేపీ టార్గెట్ చేసిందని భావిస్తున్నారు.
అయితే ఇదంతా వైసీపీ – బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా అని మరికొందరు అనుమానిస్తున్నారు. బీజేపీపై మైనారిటీలలో ఉన్న వ్యతిరేకతను వదిలించుకునేందుకు, వాళ్ల ఓట్లను రాబట్టుకునేందుకు ఎన్నికల ముందు ఆ పార్టీతో తాము దూరం అని చెప్పుకునేందుకు వైసీపీ ఆడిస్తున్న డ్రామా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ – టీడీపీ – జనసేన కలిస్తే ఇన్నాళ్లూ బీజేపీ సహాయ నిరాకరణను ఆ పార్టీలపైకి నెట్టేసే అవకాశం కలుగుతుంది. పైగా తాను ఒంటరివాడినని, వాళ్లంతా ఏకమయ్యారని మళ్లీ సానుభూతి పొందేందుకు వీలవుతుంది. మళ్లీ అధికారంలోకి వస్తే ఇప్పటిలాగే బీజేపీతో యధాతథంగా కలిసి పని చేయవచ్చు. ఏపీలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దాన్ని వదిలించుకోవాలంటే బీజేపీకి దూరమవ్వాలి. బీజేపీని టీడీపీ-జనసేన కూటమికి దగ్గర చేయాలి. ఇప్పుడు అదే జరుగుతోంది. పక్కా వ్యూహం ప్రకారమే బీజేపీ – వైసీపీ నడుస్తున్నాయని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరి అసలేం జరుగుతుందో మున్ముందు చూడాల్సి ఉంది.












