BJP : తెలంగాణలో గెలిచేందుకు బీజేపీకి ఇదే సరైన సమయమా..?
తెలంగాణలో (Telangana) అధికారంలోకి రావాలని బీజేపీ (BJP) ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణ భారతదేశంలో (South India) ఆ పార్టీ అధికారంలోకి రాగల రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇప్పటి వరకూ సౌతిండియాలో ఒక్క కర్నాటకలో (Karnataka) మాత్రమే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. మిగిలిన రాష్ట్రాలు ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా మారాయి. అయితే కాస్త గట్టిగా ప్రయత్నిస్తే తెలంగాణను కైవసం చేసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) ఉంకా నాలుగేళ్ల సమయం ఉంది. ఇప్పుడున్న పరిస్థితులు కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇందుకు కొన్ని వ్యూహాలు అవసరం.
2023 ముందు వరకూ తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) ను ఓడించి బీజేపీ అధికారంలోకి వస్తుందని అందరూ అనుకునేవారు. అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ (Bandi Sanjay) దూకుడు అలా ఉండేది. ఆయన హయాంలోనే జీహెచ్ఎంసీలో (GHMC) ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. హుజారాబాద్ (Huzurabad), దుబ్బాక (Dubbaka) ఉప ఎన్నికలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ (BRS) కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని భావిస్తున్న సమయంలో బండి సంజయ్ ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది హైకమాండ్. కిషన్ రెడ్డికి (Kishan Reddy) పగ్గాలిచ్చింది. దీంతో బీజేపీ దూకుడు తగ్గింది. పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువయ్యాయి. నేతల మధ్య సమన్వయం కొరవడింది.
అప్పటివరకూ బీఆర్ఎస్ పై బీజేపీ చేసిన దాడిని అందిపుచ్చుకోవడంలో పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) సక్సెస్ అయ్యారు. అందుకే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ (Congress) ఏకంగా అధికారాన్ని చేపట్టగలిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లకు మాత్రమే పరిమితమైంది బీజేపీ. ఓటు షేరు 6 నుంచి 13 శాతానికి పెరిగింది. ఇక ఆ వెంటనే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 8 సీట్లను కైవసం చేసుకుంది. 35 శాతం ఓటు షేరు సాధించింది. దీన్ని నిలబెట్టుకోగలిగితే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. కనీసం తాము గెలిచిన 8 పార్లమెంటు నియోజకవర్గాలపై పూర్తిగా దృష్టి పెట్టినా 56 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్భాటాలకే పరిమితమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. అలాగని బీఆర్ఎస్ కు పట్టం కట్టేందుకు కూడా ప్రజలు సుముఖంగా లేరు. ఆ పార్టీ పదేళ్ల పాలన నుంచి ఇంకా బయటపడలేదు. ఇలాంటప్పుడు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తే కచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీడీపీ (TDP), జనసేన (Janasena) లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకుంటే మరింత ప్రయోజనం కలుగుతుంది. అన్నిటికీ మించి బండి సంజయ్ లాంటి దూకుడు ప్రదర్శించే నేత ఉంటేనే బీజేపీ తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది.













