Bhuma Akhila Priya : భూమా అఖిలప్రియపై సంచలన ఆరోపణలు..! వాస్తవమెంత..?
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే (Allagadda MLA Bhuma Akhila Priya) భూమా అఖిలప్రియపై ఇటీవల వివాదాస్పద ఆరోపణలు ఎక్కువయ్యాయి. చికెన్ (Chicken) వ్యాపారులు, పొగాకు గోడౌన్ల (Tobacco Godowns) నిర్వాహకులు, ఆశ్చర్యకరంగా బిక్షగాళ్ల (beggers) నుంచి కూడా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలు ఆమె రాజకీయ జీవితంలో కొత్త సవాళ్లను తెచ్చిపెట్టాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఆమెపై పెద్ద చర్చే జరుగుతోంది. మరోవైపు టీడీపీ (TDP) అధిష్టానం కూడా ఈ ఆరోపణలపై సీరియస్ గానే దృష్టి పెట్టినట్లు సమాచారం. ఒకవేళ నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
చికెన్ వ్యాపారుల నుంచి అఖిలప్రియ కమీషన్ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు ఆరోపిస్తున్నారు. కిలో చికెన్‌కు ఒక రూపాయి నుంచి పది రూపాయల వరకు మామూలు తీసుకుంటున్నారని, దీనికి సహకరించని వారిపై అధికారుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని వారు చెబుతున్నారు. ఈ విషయంలో ఆమె భర్త ప్రమేయం కూడా ఉన్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. చికెన్ షాపులపై దాడులు, లైసెన్స్ రద్దు బెదిరింపులు లాంటి చర్యలతో వ్యాపారులను భయపెడుతున్నారని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆళ్లగడ్డ చికెన్ వ్యాపారులు సమావేశమై ఎమ్మెల్యే వసూళ్లపైన సుదీర్ఘంగా చర్చించారు.
మరోవైపు.. పొగాకు గోడౌన్ల నిర్వాహకుల నుంచి చదరపు అడుగుకు రూపాయి పావలా చొప్పున అఖిలప్రియ వసూళ్లు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ మామూళ్లు ఇవ్వని వ్యాపారులపై అధికారులతో దాడులు చేయిస్తూ, వారి వ్యాపారాలను అడ్డుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారులు ఈ విషయంలో భయాందోళనకు గురవుతున్నారు. వీటన్నిటికీ మించి.. అహోబిలంలో భిక్షగాళ్ల నుంచి కూడా అఖిలప్రియ వసూళ్లకు పాల్పడుతున్నారని వైసీపీ నేత భూమా కిశోర్ రెడ్డి (YCP Leader Bhuma Kishore Reddy) సంచలన ఆరోపణ చేశారు. “చికెన్ సెంటర్ మొదలు భిక్షగాళ్ల వరకు కమీషన్ తీసుకునే ఏకైక ఎమ్మెల్యే అఖిలప్రియ” అని ఆయన విమర్శించారు.
ఆళ్లగడ్డ ఒకప్పుడు భూమా కుటుంబానికి కంచుకోట. అయితే భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి మరణానంతరం వాళ్ల పిల్లలు ఆళ్లగడ్డ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు వీళ్లపై అవినీతి ఆరోపణలు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే తమపై వైసీపీ బురదజల్లుతోందని అఖిలప్రియ విమర్శించారు. సాక్షి ఆఫీస్ ముందు చికెన్ వ్యర్థాలు వేసి నిరసన తెలియజేశారు. అయితే ఈ ఆరోపణలపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నిజానిజాలు పరిశీలించుకున్న అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.













