బాలినేని దారెటు..? జిల్లాలో జోరుగా ఊహాగానాలు..!!
వైసీపీకి బాలినేని శ్రీనివాస రెడ్డి పెద్ద సవాల్ గా మారారు. ఇన్నాళ్లూ పార్టీ అడుగుజాడల్లో, అధినేత చెప్పినట్టు నడుచుకుంటూ వచ్చిన బాలినేని.. ఇప్పుడు అధిష్టానంపైనే నేరుగా విమర్శలు చేస్తుండడం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా జిల్లాలో తన మాటకు విలువ ఇవ్వట్లేదని, ఇదంతా అధిష్టానం వల్లేననేది బాలినేని ఆవేదన. ఇలా జరుగుతోందని చెప్తున్నా కూడా హైకమాండ్ పట్టించుకోకుండా, సమస్యను మరింత జటిలం చేస్తోందని బాలినేని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఎన్నికల నాటికి బాలినేని ఎలాంటి స్టెప్ తీసుకుంటారోననే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస రెడ్డి కీలక నేత. వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచే ఆయన జగన్ వెంట నడిచారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవిని సైతం వదులుకుని జగన్ వెంట వచ్చేశారు. అప్పటి నుంచి జిల్లాలో మంచి పట్టు సాధించారు. వైఎస్ఆర్ ఫ్యామిలీకి ముఖ్య అనుచరుడిగా పేరొందారు. జిల్లాలో రాజకీయం అంతా తన కనుసన్నల్లోనే సాగింది. గత ఐదేళ్లలో అధికారం లేకపోయినా పార్టీని కాపాడుకోగలిగారు. దీంతో 2019లో అధికారంలోకి వచ్చాక బాలినేనిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్. దీంతో ఆయనకు ప్రాధాన్యత మరింత పెరిగింది. అప్పటి వరకూ పెద్ద సమస్యలేం లేవు.
అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మూడేళ్ల తర్వాత కేబినెట్ నుంచి బాలినేనిని తప్పించారు జగన్. అదే సమయంలో జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేష్ ను కంటిన్యూ చేశారు. అంతేకాక మరో నేత, టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి పెత్తనం జిల్లాలో ఎక్కువైపోయింది. బాలినేని మాజీగా మిగిలిపోవడంతో ఈయన మాటలకు అధికారులు విలువ ఇవ్వడం తగ్గించేశారు. అధికారుల బదిలీలు, నిధుల మంజూరు లాంటి వాటిలో బాలినేని మాట పట్టించుకోవడం మానేశారు. హైకమాండ్ తో ఇలా దూరం పెరగడం మొదలైంది. తాజాగా డీఎస్పీల బదిలీల్లో తన చెప్పినవాటికి స్థానం దక్కకపోవడం, సీఎం పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ వివాదం.. బాలినేనికి మరింత ఆవేదన కలిగించాయి. దీంతో ఆయన పార్టీ సమన్యయ కర్త పదవికి రాజీనామా చేశారు.
బాలినేనిని జగన్ పలిచి మాట్లాడినా కూడా వివాద సద్దుమణగలేదు. తనకు వ్యతిరేకంగా పార్టీ నేతలే పని చేస్తున్నారని, ఇది తాను తట్టుకోలేకపోతున్నానని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. గోనె ప్రకాశ్ రావుకు ఏం సంబంధం ఉందని తనపై మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తమ పార్టీ నేతలే ఈ పని చేయిస్తున్నారన్నారు. వై.వి.సుబ్బారెడ్డికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం, మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి తనకు వ్యతిరేకంగా పనిచేయిస్తున్నారనే అనుమానాలు బాలినేనికి ఉన్నాయి. ఇన్నాళ్లూ దిగమింగుతూ వచ్చిన బాలినేని ఇప్పుడు డైరెక్ట్ అటాక్ కు దిగుతున్నారు. దీంతో ఎన్నికల నాటికి ఈ వివాదం ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది.













