నందమూరి ఇంటి గొడవకు ఫ్యాన్స్ మరింత ఆజ్యం పోస్తున్నారా..?
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో నందమూరి కుటుంబంలోని విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదంటూ టీడీపీ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అస్సలు అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. తాజాగా జూనియర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అంటూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ మరోసారి రచ్చ రాజేశాయి. బాలయ్య కామెంట్స్ పై జూనియర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బాలయ్య అభిమానులు కౌంటర్స్ ఇస్తున్నారు.
నందమూరి కుటుంబంలో కొందరి మధ్య విబేదాలున్న సంగతి తెలిసిందే. అది చాలా పెద్ద కుటుంబం. కాబట్టి చిన్న చిన్న మనస్పర్థలు మామూలే. ఇద్దరు అన్నదమ్ముల మధ్యే ఎన్నో గొడవలవుతుంటాయి. మరి 11 మంది సంతానంలో గొడవలు, విభేదాలు లేకుండా ఎలా ఉంటాయి? నందమూరి ఫ్యామిలీలో కూడా దగ్గుబాటి పురంధేశ్వరి ఫ్యామిలీతో నారా ఫ్యామిలీకి పడేది కాదు. ఇప్పుడు నందమూరి హరికృష్ణ ఫ్యామిలీతో మిగిలిన కుటుంబసభ్యులు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. హరికృష్ణ మరణం తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కలిసిపోయారు. మిగిలిన నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. చుట్టపుచూపుగా మాత్రమే కనిపిస్తున్నారు.
చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై బీజేపీ అధ్యక్షురాలి హోదాలో పురంధేశ్వరి ఖండించారు. ఇక మిగిలిన కుటుంబసభ్యులు కూడా నారా ఫ్యామిలీని ఓదార్చారు. కొంతమంది రాజమండ్రి వెళ్లి భువనేశ్వరికి సంఘీభావం ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ కానీ, కల్యాణ్ రామ్ కానీ అస్సలు పట్టించుకోలేదు. ఇలాంటి వాటికి కల్యాణ్ రామ్ మామూలుగానే దూరంగా ఉంటారు. జూనియర్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తారు. అయినా రియాక్ట్ కాకపోవడంతో టీడీపీ ఫ్యాన్స్ కు కోపం వచ్చింది. ఇప్పుడే కాదు.. గతంలో వైసీపీ నేతలు అసెంబ్లీలో భువనేశ్వరిని కించపరుస్తూ కామెంట్స్ చేసినప్పుడు, చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నప్పుడు కూడా జూనియర్ స్పందించలేదు. అయితే విమర్శలు తీవ్రం కావడంతో ఆ తర్వత కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్నట్టు భువనేశ్వరి, చంద్రబాబు పేర్లు లేకుండా జనరల్ ట్వీట్ చేసి ఊరుకున్నారు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ గోడమీద పిల్లిలాగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు.
ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ కు. జూనియర్ ఎన్టీఆర్ కు నార్నే శ్రీనివాసరావు కుమార్తె ప్రణతిని ఇచ్చి పెళ్లి చేయడం వెనుక చంద్రబాబు కుటుంబమే ముందుంది. నార్నె శ్రీనివాసరావు చంద్రబాబుకు బంధువు. అందుకే ఆ సంబంధం సెట్ అయింది. అయితే ఆ తర్వాత వాళ్ల మధ్య గ్యాప్ వచ్చింది. హరికృష్ణ ఉన్నప్పటి నుంచే విభేదాలు పొడచూపాయి. ఆయన మరణం అనంతరం ఆ గ్యాప్ అలాగే కొనసాగుతోంది. దీనికి ఇరు వర్గాల ఫ్యాన్స్ మరింత ఆజ్యం పోస్తున్నారు. బాలయ్య కూడా ఐ డేంట్ కేర్ అనడం వెనుక రీజన్ అదే. కుటుంబం అన్నాక బోలెడు విభేదాలుంటాయని.. అలా అని వదులుకుంటామా అని బాలయ్య ఆ తర్వాత కవర్ చేసినా రెండు కుటుంబాల మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నాయన్నది మాత్రం నిజం.













