అవినాశ్ రెడ్డికి ఊరట..! ముందస్తు బెయిల్ కు ఓకే చెప్పిన హైకోర్టు..!!
వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట లభించింది. అవినాశ్ రెడ్డికి ఈ నెల 25 వరకూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అప్పటి వరకూ అరెస్టు చేయొద్దని సీబీఐని ఆదేశించింది. అయితే 25వ తేదీ వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరు కావాలని అవినాశ్ రెడ్డిని ఆదేశించింది. 25వ తేదీన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.
అంతకుమందు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. అవినాశ్ రెడ్డి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ, సునీత తరపు లాయర్లు, ఇవ్వాలని ఆయన తరపు లాయర్లు గట్టిగా వాదించుకున్నారు. వివేకా హత్య కేసులో అవినాశ్ రెట్టి పాత్ర ఉందని సీబీఐ హైకోర్టుకు తెలిపింది.
వివేకా హత్య కేసులో తమ వర్షన్ ను అసలు సీబీఐ పట్టించుకోవట్లేదని అవినాశ్ తరపు న్యాయవాది వాదించారు. అవినాశ్ నేరం చేశారనేందుకు సీబీఐ దగ్గర ఆధారాలేవీ లేవన్నారు. కుటుంబ గొడవలు, భూ వివాదాలు, వివాహేతర సంబంధాలు వివేకా హత్యకు కారణమై ఉండొచ్చన్నారు. సీబీఐ ఇప్పటి వరకూ 2 ఛార్జ్ షీట్లు నమోదు చేసిందని, మొదటి ఛార్జ్ షీట్ కు ముందే దస్తగిరి స్టేట్ మెంట్ రికార్డు చేశారని అవినాశ్ లాయర్ తెలిపారు. వీటిలో ఎక్కడా అవినాశ్ పాత్ర లేదని.. అయితే అనూహ్యంగా అవినాశ్ ను సీబీఐ టార్గెట్ చేసిందని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
అయితే అవినాశ్ తరపు వాదనలను సీబీఐ న్యాయవాది ఖండించారు. వివేకా హత్యలో అవినాశ్ పాత్ర ఉందన్నారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్టు తెలిపారు. వివేకా మొదట గుండెపోటుతో చనిపోయారని అవినాశ్ చెప్పారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అలా ఎందుకు చెప్పారని న్యాయమూర్తి ప్రశ్నించారు. వేరే వాళ్లు చెప్పడం వల్ల అలా చెప్పారన్నారు అవినాశ్ తరపు న్యాయవాది. చెయ్యి, తలపై తీవ్ర గాయాలున్న వ్యక్తి లెటర్ రాసినట్లు చూపించారని, తీవ్ర గాయాలపాలైన వ్యక్తి ఎలా లెటర్ రాస్తారని సీబీఐ తరపు న్యాయవాది ఆర్గ్యూ చేశారు. పైగా ఈ హత్య వెనుక రాజకీయ కారణాలు తప్ప వ్యాపార లావాదేవీలు, వివాహేతర సంబంధాలు లేవని స్పష్టం చేశారు. అంతేకాక ఈ కేసును ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, కాబట్టి అవినాశ్ కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ విజ్ఞప్తి చేసింది.
మరోవైపు ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డి, అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిలను ఆరు రోజుల సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో వారిని ఈ నెల 24 వరకూ సీబీఐ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. రేపటి నుంచి అవినాశ్ రెడ్డి కూడా విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించడం వీళ్లు ముగ్గురిని సమాంతరంగా, లేదంటే కలిపి విచారించే అవకాశం ఉంది.













