AP Volunteers: రాజకీయ లెక్కల మధ్య నలిగి ఒంటరిగా మిగిలిన వాలంటీర్లు..

జగన్ (Jagan) పాలనలో, ఏపీ (Andhra Pradesh)లో వాలంటీర్ వ్యవస్థ (Volunteers) ఓ ప్రత్యేకమైన ప్రయోగంగా మొదలైంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వం అమలు చేసిన కీలకమైన ఆలోచన. ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించి, ప్రజల ఇంటి వద్దకే పౌర సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం తెర మీదికి వచ్చింది. తక్కువ చదువున్నవారికైనా ఉపాధి కల్పించే ఈ విధానం ఎంతో మందికి ఉపశమనం ఇచ్చింది. ప్రతి నెలా ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తూ దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్లను ఐదేళ్ళపాటు ప్రభుత్వం పోషించింది.
ఈ వ్యవస్థ విజయవంతంగా నడవాలని వైఎస్ జగన్ (Y. S. Jagan) ఎంతో ఆసక్తి కనబరిచారు. అయితే రాజకీయ నాయకుల జోక్యం పెరగడంతో వాలంటీర్లపై పార్టీ ముద్ర పడింది. స్థానిక వైసీపీ నేతల ఆధీనంలోకి వెళ్లిన వాలంటీర్లు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు. మరోవైపు పార్టీ క్యాడర్‌ను పట్టించుకోకుండా వాలంటీర్లపై ఆధారపడడం వల్ల అసలైన కార్యకర్తలు దూరమయ్యారు. దీని ప్రభావం 2024 ఎన్నికలలో స్పష్టంగా కనిపించింది.
ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచడమూ వైసీపీకి తీరని నష్టంగా మారింది. ఫలితంగా పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమై ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఆ తర్వాత పార్టీ వాలంటీర్లను పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి కూడా (TDP-led Alliance) ఈ వ్యవస్థను పునరుద్ధరించే ఆసక్తిని చూపించడం లేదు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పుడు మాత్రం తాము ఏ విధంగా బాధ్యత వహించలేమని, గత ప్రభుత్వం 2023 August తర్వాత,వాలంటీర్ల సేవలను కొనసాగించకపోవడం వల్ల తాము పునరుద్ధరించలేకపోతున్నామని చెబుతున్నారు.
వైసీపీకి చూస్తే, తాము ఐదేళ్లపాటు వేతనం ఇచ్చినప్పటికీ, వాలంటీర్లు చివరికి కూటమి హామీలకే లొంగిపోయారని భావిస్తూ, వారిపై ఆసక్తి కోల్పోయినట్టు కనిపిస్తోంది. జగన్ 2.0లో పూర్తి స్థాయిలో పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థను మళ్లీ ప్రస్తావించకుండా ఉండాలని వైసీపీ ఆలోచిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మొత్తానికి ఇలా రెండు పార్టీల రాజకీయ పరిణామాల్లో చివరికి నష్టపోయింది మాత్రం వాలంటీర్ వ్యవస్థే. మొదట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ ప్రయోగం, చివరికి పాలకుల రాజకీయ లెక్కల మధ్య నలిగిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో ఆ వ్యవస్థ పునరుత్థానం అయ్యే అవకాశాలు మసకబారినట్టు అనిపిస్తోంది. ఇలా జగనన్న సారథులు.. వైసీపీ వారదులు ఫైనల్ గా ఒంటరిగా మిగిలారు.