ఏపీలో స్పీడుగా మారుతున్న రాజకీయ పరిణామాలు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే రాజకీయ పార్టీలన్నీ యాక్టివ్ అయిపోయాయి. పూర్తిస్థాయి పాలిటిక్స్ చేస్తున్నాయి. అధికార పార్టీనే ఈ విషయంలో కాస్త ముందుందనే చెప్పొచ్చు. వైసీపీ గడపగడపకూ ప్రభుత్వం పేరుతో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. దీంతో మిగిలిన పార్టీలు కూడా యాక్టివ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన కూడా స్పీడందుకున్నాయి. బీజేపీ కూడా తన స్థాయిలో ప్రయత్నిస్తోంది. అయితే వైజాగ్ గర్జన తర్వాత ఏపీలో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. వైసీపీ – జనసేన మధ్య మొదలైన పంచాయితీ ఇప్పుడు టీడీపీ – జనసేన దగ్గరయ్యే పరిస్థితి తీసుకొచ్చింది.
ఏపీలో ఎన్నికల ముఖచిత్రం కొంచెం కొంచెం బయటపడుతోంది. ఏ పార్టీ ఒంటరిగా వెళ్తుంది.. ఏ ఏ పార్టీలు కలిసి పోటీ చేస్తాయి.. అనే దానిపై ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వస్తోంది. అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేయడం ఖాయం. ఆ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు. పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ పార్టీది ఒంటరిపోరే. ఇప్పుడు బీజేపీతో సన్నిహితంగా ఉన్నా.. ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే వెళ్లి సత్తా నిరూపించుకోవాలనుకుంటోంది వైసీపీ. సింహం సింగిల్ గానే వస్తుందనే డైలాగ్ ఆ పార్టీ నేతలు పదేపదే చెప్పే మాట. అందుకు తగ్గట్లే ఈసారి కూడా ఆ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగనుంది.
ఇక టీడీపీ ఎవరితో వెళ్తుందనేదానిపై కొంచెం క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేసింది టీడీపీ. అయితే 2019 నాటికి ఆ పార్టీకి జనసేన, బీజేపీ దూరమయ్యాయి. దీంతో టీడీపీ ఒంటరైంది. బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. కానీ కేంద్రంలోని బీజేపీ పెద్దల నుంచి సానుకూల సంకేతాలు రావట్లేదు. దీంతో వేచి చూస్తోంది.
అయితే జనసేనతో మాత్రం టీడీపీ కలిసి వెళ్తుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. బీజేపీతో ప్రయాణంపై జనసేన అంత సంతృప్తిగా లేదు. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ తమ పార్టీ నేతలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నా.. వైసీపీతో సన్నిహితంగా ఉన్న బీజేపీ మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని పవన్ కల్యాణ్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ మధ్య ఒకటి రెండు సందర్భాల్లో ఈ విషయాన్ని బహిరంగంగానే వెల్లడించారు. ఇవాళ కూడా రూట్ మ్యాప్ ఇవ్వాలని బీజేపీని కోరితే ఇవ్వలేదని.. ఆలస్యం చేస్తే తమ పార్టీకి ప్రమాదమని .. అందుకే వ్యూహం మార్చుకునేందుకు కూడా వెనుకాడబోమని పవన్ స్పష్టం చేశారు. ఇలా పార్టీ ఆఫీస్ లో మాట్లాడి హోటల్ కు చేరుకున్న వెంటనే పవన్ కల్యాణ్ తో చంద్రబాబు భేటీ అయ్యారు.
పవన్ కల్యాణ్ తో చంద్రబాబు భేటీ కావడంతో టీడీపీ – జనసేన పార్టీల మధ్య పొత్త ఖాయమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ కూడా ముసుగు తొలగిపోయిందని కామెంట్ చేస్తోంది. వాస్తవానికి వైసీపీని ఓడించాలనేదే టీడీపీ, జనసేన సిద్ధాంతం. వైసీపీని ఓడించేందుకు ఎవరితోనైనా కలసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని పవన్ కల్యాణ్ పదే పదే చెప్తున్నారు. అందుకోసమే చంద్రబాబుతో కలిసి వెళ్లడం ఖాయమని భావిస్తున్నారు. బీజేపీకి అంత స్థాయి లేదు కాబట్టి వైసీపీని ఓడించాలంటే టీడీపీతో కలిసి వెళ్లడమే జనసేన ముందున్న ఏకైక మార్గం. ఇప్పుడు పవన్ తో చంద్రబాబు భేటీ కావడంతో అది దాదాపు ఖరారైందనే సంకేతాలు వెళ్తున్నాయి.
ఇక బీజేపీది ఒంటరి పోరే. గతంలో బీజేపీ ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేసిన దాఖలాలు లేవు. కానీ ఈసారి ఆ పరిస్థితి తప్పదేమోననే భావన కలుగుతోంది. ఎందుకంటే టీడీపీతో కలిసేందుకు కేంద్రంలోని బీజేపీ పెద్దలు సుముఖంగా లేరు. కాబట్టి కేంద్రాన్ని కాదని రాష్ట్రంలో బీజేపీ ముందడుగు వేసే పరిస్థితి లేదు. అలాగని అధికార వైసీపీతో కలిసి వెళ్దామనుకుంటే ఆ ఛాన్సే లేదు. వైసీపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా లేదు. కాబట్టి ఈసారి ఎన్నికల్లో వైసీపీ, బీజేపీలు ఒంటరిగా, టీడీపీ – జనసేన ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరి చూద్దాం ఎన్నికల నాటికి ఇంకెన్ని సిత్రాలు దర్శనమిస్తాయో..!













