AP Liquor Scam: మళ్లీ మొదలైంది, స్పై సినిమాల్లో నల్లధనం ..సిట్ విచారణలో బయటపడ సీక్రెట్స్..

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా సంచలనం రేపిన లిక్కర్ కుంభకోణంపై సిట్ (SIT) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ స్కాంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా నల్లధనాన్ని పరిరక్షించుకోవడానికిగాను సినిమా రంగాన్ని వినియోగించారని తాజా ఆధారాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న వ్యక్తిగా రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy) పేరును అధికారులు నిర్ధారించారు.
ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ (ED Entertainments) అనే బ్యానర్‌పై రెండు సినిమాలను నిర్మించినట్లు వెల్లడైంది. సుమంత్ (Sumanth) నటించిన “మళ్లీ మొదలైంది (Malli Modalaindi)”, నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) నటించిన “స్పై (Spy)” సినిమాల వెనుక నిజంగా ఏమున్నదీ విచారణలో బయటపడింది. సిట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ రెండు సినిమాలకు దాదాపు రూ.40 కోట్లు నల్లధనాన్ని వినియోగించారు. కానీ లెక్కల్లో మాత్రం నిర్మాణ వ్యయం కేవలం రూ.12 కోట్లు మాత్రమే చూపించారు. మిగిలిన డబ్బు అప్పులు తీసుకున్నట్లు చూపిస్తూ పత్రాలు సృష్టించారు.
అయితే ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలను, డిస్టిలరీలు మరియు మద్యం పంపిణీ సంస్థల నుంచి వచ్చిన డబ్బులను గమనించి అసలు కధను సిట్ వెలికితీసింది. ఈ సంస్థకు సంబంధించిన కీలక వ్యక్తి ఉప్పలపాటి చరణ్ తేజ్ (Uppalapati Charan Tej)ను అధికారులు విచారించారు. ఆయన వద్ద నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా, బాక్సాఫీస్‌లో ఫెయిలైన సినిమాలు అయినప్పటికీ ఓటీటీ హక్కులు, ఇతర పంపిణీ రాయితీలు కలిపి మొత్తం రూ.36 కోట్లకు అమ్మినట్టు తెలిసింది. దీని ద్వారా నల్లధనాన్ని వైట్ చేసేందుకు ఈ సినిమా ప్రాజెక్టుల్ని వేదికగా వాడినట్లు తేలింది.
మరో విషయం ఏమిటంటే, “స్పై” చిత్రానికి నిఖిల్‌కు రూ.10 కోట్లు పారితోషికంగా చెల్లించినప్పటికీ, రికార్డుల్లో కేవలం రూ.90 లక్షలే చూపించారు. ఈ సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం జోర్డాన్ (Jordan)లో జరిగినప్పటికీ, అక్కడ పెట్టిన ఖర్చులకు సంబంధించిన ఎలాంటి వివరాలు లెక్కల్లో చూపలేదని అధికారులు వెల్లడించారు. ప్రయాణ టిక్కెట్ల లెక్కలు కూడా లేకపోవడం అనుమానాలను మరింత బలపరిచింది. మొత్తానికి, జగన్ ప్రభుత్వం (Jagan Government) హయాంలో సినిమా రంగాన్ని ధన శుద్ధికి వేదికగా మార్చినట్లు అధికారులు తేల్చారు. ప్రభుత్వం మారిన తరువాత ఈ సంస్థ కార్యకలాపాలు పూర్తిగా ఆగినట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థాన దృష్టికి వెళ్లింది.