AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం.. రోజుకో కొత్త పేరు..!!

ఆంధ్రప్రదేశ్‌లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ లిక్కర్ స్కాం (AP Liquor Scam) కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తీసుకుంటోంది. అనేక మంది ప్రముఖుల పేర్లు బయటికొస్తున్నాయి. దాదాపు రూ. 3,200 కోట్ల మేర ఈ కుంభకోణంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని అంచనా. మద్యం వ్యాపారంలో అవకతవకలు, కిక్‌బ్యాక్‌లు, మనీలాండరింగ్ ఆరోపణలు ఈ కేసులో దాగి ఉన్నాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.
2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ విధానం ద్వారా రూ. 3,200 కోట్ల వరకు కిక్‌బ్యాక్‌లు సేకరించినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది. ఈ కేసులో కీలక నిందితుడిగా గుర్తించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Raj Kasireddy) గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఐటీ సలహాదారుగా పనిచేశారు. రాజ్ కసిరెడ్డి బృందం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL)) నుంచి భారీ చెల్లింపులు స్వీకరించి, షెల్ కంపెనీల ద్వారా ఈ నిధులను రియల్ ఎస్టేట్ వెంచర్‌లలో పెట్టుబడిగా మార్చినట్లు సిట్ గుర్తించింది.
మే 17న విజయవాడలోని ఏసీబీ కోర్టులో మాజీ బ్యూరోక్రాట్లు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ హాజరుపరిచింది. వీరితో పాటు ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్టు చేశారు. వారిలో రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్, గోవిందప్ప, బాలాజీ ఉన్నారు. సిట్ వీళ్లను వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవాలని కోర్టును కోరింది. మే 16న సుప్రీం కోర్టు ఈ కేసులో ఇద్దరు నిందితులకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. రాజకీయ దురుద్దేశంతో కూడిన ఆరోపణలు ముందస్తు బెయిల్‌కు ఆధారం కాజాలవని స్పష్టం చేసింది.
మే 8న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేసింది. ఈడీ, సిట్ నుంచి ఎఫ్ఐఆర్, చార్జిషీట్, బ్యాంక్ ఖాతాల వివరాలను కోరింది. ఈ కేసులో 33 మందిని నిందితులుగా పేర్కొన్న ఈడీ, లిక్కర్ స్కాం నిధులను బెంగళూరు రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో పెట్టుబడిగా మార్చినట్లు గుర్తించింది. ఈ ఆస్తుల విలువ ప్రస్తుతం రూ. 3,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసింది.
ఈ కేసులో రాజ్ కసిరెడ్డి ‘కింగ్‌పిన్’ గా ఉన్నారు. అతనితో పాటు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ కీలక పాత్ర పోషించినట్లు సిట్ ఆరోపించింది. వీరు కిక్‌బ్యాక్‌లను షెల్ కంపెనీల ద్వారా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా మార్చినట్లు ఆధారాలు సేకరించింది. అలాగే వైసీపీ నాయకులు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి పేర్లు కూడా ఈ కేసులో ప్రస్తావనకు వచ్చాయి. తాజాగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి పేర్లు కూడా ఈ కేసులో వెలుగులోకి వచ్చాయి. సిట్ ప్రస్తుతం రోహిత్ రెడ్డి, సవిరెడ్డి, శ్రీలత, నితిన్ కృష్ణ, రూపక్ జాద్ వంటి వ్యక్తులకు కూడా షెల్ కంపెనీలతో సంబంధం ఉన్నట్లు దర్యాప్తు చేస్తోంది. మొత్తానికి ఏపీ లిక్కర్ స్కాం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ప్రధాన నిందితులంతా అరెస్టు కావడంతో విచారణ ముగింపు దశకు వచ్చిందని భావించారు. అయితే విచారణలో అనేక కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తుండడం, కొత్త వ్యక్తులు తెరపైకి రావడంతో దర్యాప్తు ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు.