ఏపీలో మళ్లీ రాజధానుల రచ్చ..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి దీనిపైన చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఇంతవరకూ రాజధాని మాత్రం సాకారం కాలేదు. అధికారికంగా ఇప్పటికైతే అమరావతే రాజధాని. కానీ దీనిపై అధికార వైసీపీ సుముఖంగా లేకపోవడంతో ఇది ఉన్నా లేనట్టే. మూడు రాజధానులను తెరపైకి తెచ్చిన వైసీపీ.. దాన్ని కూడా పూర్తి చేయలేకపోయింది. ఇప్పుడేమో మళ్లీ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కంటిన్యూ చేయాలంటున్నారు. మరోవైపు తిరుపతిని రాజధానిగా చేయాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది.
రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. అక్కడ తాత్కాలికంగా సెక్రటేరియేట్, అసెంబ్లీ, హైకోర్టు లాంటి వాటిని నిర్మించింది. దీన్ని ప్రపంచంలోనే ఒక అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఐకానిక్ బిల్డింగ్స్ ను తెరపైకి తెచ్చారు. నమూనాలు కూడా పూర్తయ్యాయి. శాశ్వత సెక్రటేరియేట్, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన కూడా జరిగింది. ఇంతలో ఎన్నికలు రావడంతో టీడీపీ ఓడిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో కథ మొదటికొచ్చింది.
అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు అసెంబ్లీలో వైసీపీ మద్దతు తెలిపింది. అయితే అధికారంలోకి వచ్చాక దీన్ని మాత్రమే కాకుండా మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలును కూడా రాజధానిగా నిర్ణయిస్తూ జీవో విడుదల చేసింది. అయితే ఈ బిల్లు శాసనమండలిలో పాస్ కాలేదు. రైతులు కోర్టుకు వెళ్లడంతో చట్టపరంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మూడు రాజధానుల జీవోను వెనక్కు తీసుకుంది. అయినా విశాఖలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే పరిపాలన సాగించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఆమేరకు అక్కడ భవనాలను కూడా నిర్మించారు. కానీ ఏమైందో ఏమో జగన్ విశాఖ వెళ్లలేదు.
ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపించాయి. దీంతో రాజధాని టాపిక్ మళ్లీ చర్చల్లోకి వచ్చింది. అమరావతే రాజధానిగా ఉండాలని టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ కోరుకుంటుండగా వైసీపీ మాత్రం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని చెప్తోంది. తాజాగా వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధానిపై చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఏపీ రాజధాని ఇంకా పూర్తి కానందున ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరో రెండేళ్లయినా కంటిన్యూ చేయాలని ఆయన కోరారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో అది పార్టీ విధానం కాదని.. వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగతమని మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉండగానే తిరుపతిని రాజధానిగా ప్రకటించాలని కాంగ్రెస్ నేత చింతామోహన్ డిమాండ్ చేస్తున్నారు. తప్పకుండా తిరుపతి రాజధాని అవుతుందంటున్నారు. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రాజధానిపై మాట్లాడుతున్నారు. ఏపీ ప్రజలు మాత్రం రాజధాని లేని రాష్ట్రంలో ఉంటున్నామని ఆవేదన చెందుతున్నారు. పదేళ్లయినా రాజధాని లేకుండా పబ్బం గడుపుకున్న రాజకీయ పార్టీలు ఇప్పుడు మళ్లీ ఎన్నికల్లో దాన్ని సొమ్ము చేసుకునేందుకు ఆపసోపాలు పడుతున్నాయి. ఈసారైనా ఓటర్లు తగిన బుద్ధి చెప్తారో లేదో చూడాలి.













