పెన్షన్ లపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం..!
మరో 18 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అభివృద్ధి, సంక్షేమానికి తుదిమెరుగులు దిద్దే పనిలో బిజీగా ఉన్నారు సీఎం జగన్. నవరత్నాల అమల్లో భాగంగా ఇంకా ఏవైనా పెండింగ్ లో ఉన్నాయేమోనని పరిశీలించుకుంటున్నారు. వాటిని త్వరగా పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ముఖ్యంగా సామాజిక పెన్షన్లను జనవరి 1 నుంచి రూ.2750కి పెంచాలని నిర్ణయించింది. పెంచిన మొత్తాన్ని జనవరి ఒకటో తేదీ నుంచే పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి పింఛను మొత్తం 2వేల రూపాయలుగా ఉంది. దాన్ని ప్రతి ఏటా రూ.250 చొప్పున పెంచుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.2500 ఇస్తున్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి ఈ మొత్తం రూ.2750లు అందనుంది. గతంలో లాగా కాకుండా ఒకటో తేదీనే వాలంటీర్లు ఈ పింఛన్లను నేరుగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి అందిస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై పింఛను లబ్దిదారులు ఎంతో పాజిటివ్ గా ఉన్నారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని మరో రూ.250 పెంచుతుండడం కచ్చితంగా జగన్ సర్కార్ కు లబ్ది చేకూర్చే అంశమే.
కేబినెట్ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇప్పటికే కడప స్టీల్ ప్లాంట్ కు 3 సార్లు శంకుస్థాపనలు జరిగాయి. విభజన హామీ చట్టంలో కూడా ఇది ఉంది. కానీ కార్యరూపం మాత్రం దాల్చలేదు. కానీ ఇప్పుడు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు JSW కంపెనీ ముందుకొచ్చింది. దీనికి కేబినెట్ ఆమోదం తెలపడం సంతోషించదగ్గ అంశం. అలాగే అదాని, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలు నెలకొల్పబోయే ప్రాజెక్టులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. SIPB ఆమోదించిన విద్యుత్ ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక జగన్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు ట్యాబ్ లు పంపిమీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 21వ తేదీన సుమారు 5లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు వీటిని పంపిణీ చేయనున్నారు. వీటి పంపిణీలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే పింఛన్ల పంపిణీలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమాలను ఒక పండుగ వాతావరణంలో నిర్వహించాలని చెప్పారు. ఇప్పటికే స్కూళ్లను నాడు – నేడు ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. వాటిలో టీవీలు ఏర్పాటు చేయాలని.. వాటి ద్వారా విద్యార్థులకు కంటెంట్ అందించాలని కేబినెట్ సూచించింది. మరోవైపు ఉపాధ్యాయులను బోదనేతర విధుల నుంచి తప్పిస్తూ జారీ చేసిన జీవోకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇక… బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండల కేంద్రాన్ని జజ్జూరుకు మారుస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏపీ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్ చట్టంలో సవరణలకు కూడా జగన్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.













