వైసీపీ గూటికి అంబటి రాయుడు.. త్వరలో న్యూ ఇన్నింగ్స్..!?
క్రికెట్ లో తనదైన శైలిలో రాణిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన అంబటి రాయుడు. టీమిండియాకు ఆడిన అంబటి రాయుడు ప్రస్తుతం ఐపీఎల్ కు మాత్రమే పరిమితం అయ్యాడు. కొన్ని వివాదాల నేపథ్యంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించడానికి దూరమైన రాయుడు.. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్నాడు. అయితే రాయుడు త్వరలోనే సరికొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ ముగిసిన అనంతరం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం.
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు అంబటి రాయుడు స్వగ్రామం. అయితే ఆయన ఎక్కువకాలం హైదరాబాద్ లోనే ఉన్నారు. అక్కడే క్రికెట్ లో ఓనమాలు నేర్చుకున్నారు. టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే స్థాయికి ఎదిగారు. వన్డే, టెస్ట్, టీ20.. ఇలా అన్ని ఫార్మాట్లలోనూ అంబటి రాయుడు ఆడాడు. అయితే కొన్ని వివాదాలు చుట్టుముట్టడంతో ఆవేశంలో క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. కేవలం ఐపీఎల్ కు మాత్రమే పరిమితమయ్యాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న రాయుడు.. ధోనీకి సన్నిహితుడిగా పేరొందాడు.
అంబటి రాయుడుకు రాజకీయాల్లోకి వెళ్లాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో రాయుడు వెల్లడించారు. తెలంగాణలోనే ఎక్కువ కాలం గడపడంతో అక్కడి నుంచే బరిలోకి దిగుతాడని అందరూ అనుకున్నారు. అయితే అలా కాకుండా తాను ఏపీ రాజకీయాల్లోకే అడుగు పెట్టాలనుకుంటున్నట్టు రాయుడు వెల్లడించారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాల్లో ఉంటానన్నాడు. అయితే ఏ పార్టీలో చేరేది ఇంకా తేల్చుకోలేదన్నారు. అంతేకాక, తనను ఏ పార్టీ కూడా ఇంకా ఆహ్వానించలేదన్నాడు. కానీ అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో జనసేన లేదా బీఆర్ఎస్ లో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు తెలిసి బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షశ్రుడు తోట చంద్రశేఖర్.. రాయుడిని ఆహ్వానించినట్టు సమాచారం.
అయితే అంబటి రాయుడు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో వైసీపీ అధినేత, సీఎం జగన్ వీడియోను పోస్టు చేశాడు. దీంతో అంబటి రాయుడు వైసీపీలో చేరతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. సత్తెనపల్లి ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు.. రాయుడిని వైసీపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇందుకు రాయుడు అంగీకరించినట్టు సమాచారం. గుంటూరు జిల్లాలోనే ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.













