రామ్ గోపాల్ వర్మ సినిమాల సంగతేంటి అంబటి గారూ..!?
మంత్రి అంబటి రాంబాబుకు పెద్ద చిక్కే వచ్చి పడింది. మంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఆయన తన శాఖకు మాత్రమే పరిమితం అయి ఉంటే బాగుండేది. ఏదైనా ప్రాజెక్టు గురించి ప్రెస్ మీట్ పెట్టి ఉంటే అందరూ శెభాష్ అనే వాళ్లు. అలా కాకుండా పవన్ కల్యాణ్ నటించిన ఓ సినిమా కలెక్షన్ల పైన, ఆ సినిమాలో క్యారెక్టర్ల పైన ప్రెస్ మీట్ పెట్టడం, తాము కూడా సినిమాలు తీస్తున్నట్టు ప్రకటించడం పెద్ద దుమారమే రేపుతోంది. అంబటి రాంబాబు రగిల్చిన ఈ రగడ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
బ్రో మూవి నిర్మాతలు ఈ సినిమా కోసం హవాలా సొమ్మును వాడారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. విదేశాల డబ్బును సినిమాల ద్వారా లబ్ది పొందుతున్నారని విమర్శించారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్తున్నట్టు అంబటి వెల్లడించారు. అయితే అంబటి ఆరోపణలను బ్రో సినిమా నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఖండించారు. ఏదైనా అక్రమం జరిగి ఉంటే బాధ్యతాయుత సంస్థలు చర్యలు తీసుకుంటాయన్నారు. ఎవరో ఏదో ఆరోపిస్తే తాము వాటికి స్పందించాల్సిన అవసరం లేదన్నారాయన. ఇదంతా బ్రో సినిమా అక్రమాలకు సంబంధించిన మ్యాటర్.
ఇక ఈ సినిమాల తనను పోలిన క్యారెక్టర్ ను పృథ్వీ వేశారని అంబటి రాంబాబు చెప్పారు. తనను కించపరిచేందుకే దర్శకుడు, రచయిత ఈ క్యారెక్టర్ క్రియేట్ చేశారన్నారు. ఇలాంటి సన్నివేశాలు తీసేముందు దర్శక రచయితలు జాగ్రత్తగా ఉండాలని.. లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సరిగ్గా ఇక్కడే జనసైనికులకు బాగా కాలింది. సినిమాలో ఒక చిన్న సన్నివేశానికే అంబటి రాంబాబు ఇంతగా ఎందుకు గింజుకుంటున్నారని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.
తమ నాయకుడు పవన్ కల్యాణ్ ను కించపరూస్తూ పవన్ కల్యాణ్ పలు సినిమాలు తీశారని జనసైనికులు చెప్తున్నారు. తమ నాయకుడి హావభావాలను ఇమిటేట్ చేయడమే కాక.. డైలాగ్స్ తో వ్యక్తిగత విమర్శలకు కూడా పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి వాటిపైన అప్పుడు పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపలేదని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. పైగా రామ్ గోపాల్ వర్మ చేత తమను కించపరిచేలా సినిమాలు తీయిస్తున్నది వైసీపీ నేతలేనని స్పష్టం చేశారు. అలాంటి నేతలకు ఇప్పుడు ఈ సన్నివేశంపై మాట్లాడే అర్హత లేదని కౌంటర్ ఇస్తున్నారు. అంబటి రాంబాబు పైన పవన్ కల్యాణ్ పైన సినిమాలు తీస్తే… ఆయన పైన కూడా తాము సినిమాతో పాటు వెబ్ సిరీస్ లు తీస్తామని ప్రకటించారు.













