Amaravati : అమరావతిని అడ్డుకునేందుకు మళ్లీ కుట్రలు..?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం విడిపోయి పదేళ్లు దాటింది. అయినా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు రాజధాని (Capital City) మాత్రం లేదు. మొదటి ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు (Chandrababu).. అమరావతిని (Amaravati) రాజధానిగా ప్రకటించారు. దాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రాథమికంగా కొన్ని చర్యలు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ (YS Jagan).. అమరావతి రాజధానిని పక్కన పెట్టేశారు. మూడు రాజధానుల నినాదాన్ని తెరపైకి తెచ్చారు. అది కూడా ఆయన పూర్తి చేయలేదు. దీంతో ఏపీ రాజధాని (AP Capital) వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి దాన్ని ఎలాగైనా పూర్తి చేయాలని సంకల్పించారు. అయితే ఆదిలోనే అమరావతిని అడ్డుకునేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారు.
దేశంలో ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ప్రజలందరూ తమకు ఒక రాజధాని ఉండాలని కోరుకుంటారు. మీ రాజధాని ఏదంటే ఇప్పటికీ సమాధానం చెప్పలేని పరిస్థితి ఆంధ్ర ప్రజలది. ఈ పాపమంతా రాజకీయ నాయకులదే. వాళ్లకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే రాజధాని రూపుదిద్దుకోలేకపోయింది. ఇప్పుడు చంద్రబాబు తన కలల రాజధాని అమరావతిని పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం దశలవారీగా దాదాపు రూ.60 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని నిర్ణయించారు. పనులకు ఆమోద ముద్ర కూడా వేశారు. ఇక్కడ పెట్టే ఖర్చును రాజధాని నగరం అభివృద్ధి చెందిన తర్వాత భూములు అమ్మడం ద్వారా తీర్చుకోవాలని నిర్ణయించారు.
అయితే ఒక్క అమరావతికే రూ.60వేల కోట్లు ఖర్చు పెడతారా..? ఇలాగైతే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏం కావాలి..? అమరావతిపైన పెట్టే ఖర్చును ఉత్తరాంధ్ర, రాయలసీమవాసులు ఎందుకు భరించాలి.. లాంటి అనేక ప్రశ్నలను కొంతమంది మేధావులం అని చెప్పుకుంటున్న ఈఏఎస్ శర్మ (EAS Sharma) లాంటి వాళ్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకరిస్తే రాయలసీమ, ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రొఫెసర్ హరగోపాల్ (Prof. Haragopal) ప్రశ్నిస్తున్నారు. గత ఐదేళ్లలో అమరావతిని ఎండగట్టి మూడు రాజధానులను తెరపైకి తెచ్చి.. దాన్ని కూడా పూర్తి చేయలేకపోయిన జగన్ ను వీళ్లెవరూ పల్లెత్తు మాట అనలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు అమరావతి పనులను మొదలు పెడుతున్నప్పుడే వాయిస్ మొదలు పెట్టేశారు.
వాస్తవానికి ఏపీలో అత్యధిక పరిశ్రమలు ఉన్న ప్రాంతం రాయలసీమ (Rayulaseema). ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలు రాయలసీమలో నెలకొన్నాయి. అలాగే ఉత్తరాంధ్ర (Uttarandhra) ఫార్మా, ఐటీ, స్టీల్, ఆక్వా కంపెనీలకు ప్రసిద్ధి. రాష్ట్ర జీడీపీలో విశాఖదే అగ్రస్థానం. గోదావరి జిల్లాల్లో ఒకప్పుడు వ్యవసాయం బాగుండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అభివృద్ధి విషయంలో ఇప్పుడు కోస్తాతో పోల్చితే రాయలసీమ, ఉత్తరాంధ్రే కాస్త ముందున్నాయి. అయితే ఒక్కడ తగిన మౌలిక వసతులు లేకపోవడం వల్ల ఇప్పటికీ అవి వెనుకబడి ఉన్నాయి. ఆ గ్యాప్ ను ఫిల్ చేయగలిగితే సమస్య ఉండదు. కానీ ఇవేవీ తెలియని కొంతమంది మేధావులు అమరావతిని వ్యతిరేకించాలనే ఏకైక లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇలాంటి మాటల ద్వారా ఏపీకి శాశ్వతంగా రాజధాని లేకుండా చేయాలని భావిస్తున్నారు.













