Amaravathi: అమరావతి విస్తరణకు రైతుల మద్దతు ..అభివృద్ధికి కొత్త దారులు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రాజధాని అమరావతి (Amaravati) మరింత ఊపందుకుంది. కొత్త ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో ఇప్పటి వరకు నిర్ణయించిన 34,000 ఎకరాల స్థానాన్ని మరో 44,000 ఎకరాలకు విస్తరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు అమరావతిలో తమ కార్యాలయాలు నెలకొల్పేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి. దీనివల్ల భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. అమరావతి చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులు తమ భూములు రాజధాని నిర్మాణానికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గతంలో ఎక్కడైనా భూములు తీసుకుంటే రైతుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుండగా, ఇక్కడ రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం విశేషం.
ప్రస్తుతం అమరావతిలో భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు, ప్రోత్సాహాలు ఇతర రైతులను కూడా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా తుళ్ళూరు (Thullur), మండడం (Mandadam), వెలగపూడి (Velagapudi) వంటి గ్రామాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం భవిష్యత్తులో మరింత అభివృద్ధి పనులు చేపడుతుందన్న నమ్మకంతో రైతులు తమ భూములను ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ (P. Narayana) వద్దకు పలువురు రైతులు వెళ్లి తమ గ్రామాల్లో భూములు తీసుకోవాలని కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
గన్నవరం (Gannavaram) వద్ద ఉన్న విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయం తీసుకున్నా, ఇప్పుడు అమరావతిలోనే విమానాశ్రయం నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అంతర్జాతీయ సలహాదారులు రాజధానిలోనే విమానాశ్రయం ఉంటే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని సూచించడంతో ప్రభుత్వం తన ప్రణాళికలు మార్చుకుంటోంది.
రాజధాని పనులు మూడు సంవత్సరాల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటుండటంతో ఫైనాన్స్ రంగంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో రుణాలిచ్చేందుకు ఆసక్తి చూపని బ్యాంకులు ఇప్పుడు అమరావతికి రుణాలు ఇవ్వాలని సిద్ధంగా ఉన్నాయంటున్నారు. ఎస్బిఐ (SBI), యూనియన్ బ్యాంక్ (Union Bank ) వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రతినిధులు అమరావతికి వచ్చి చర్చలు జరిపినట్లు సమాచారం. అంతేకాక, వరల్డ్ బ్యాంక్ (World Bank), ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(Asian Development Bank), జర్మన్ బ్యాంక్ (German Bank), హుడ్కో (HUDCO) వంటి సంస్థలు ఇప్పటికే నిధులు సమకూర్చినట్టు తెలుస్తోంది. మొత్తం మీద అమరావతి అభివృద్ధి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. రైతుల ఆదరణ, ప్రభుత్వ చురుకుదల, సంస్థల ఆసక్తి కలసి రాజధానిని దేశంలోనే ఒక ప్రముఖ నగరంగా తీర్చిదిద్దే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.













