Amaravathi: ఆంధ్రా రాజధాని అభివృద్ధిలో జాప్యం .. ఆందోళనలో అమరావతి రైతులు..
అమరావతి రాజధాని (Amaravathi Capital) నిర్మాణంపై రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. గతంలో 34 వేల ఎకరాలను స్వచ్ఛందంగా సమర్పించిన రైతులు ఇప్పటికీ అభివృద్ధి ఆశించినంతగా కనిపించకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వ చర్యలు స్పష్టంగా లేకపోవడం, పనులు ఎక్కడా ప్రారంభం కాకపోవడంతో రాజధాని కోసం ఎదురుచూస్తున్న ప్రజల్లో కూడా నిరాశ నెలకొంది. తాజాగా ప్రభుత్వం మరో 44 వేల ఎకరాల అవసరం ఉందని ప్రకటించడం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది.
రాజధాని నిర్మాణానికి గడచిన టీడీపీ (TDP) ప్రభుత్వ కాలంలో చేసిన ప్రణాళికలపై అప్పట్లో విమర్శలు వచ్చినా, అనేక రకాల అడ్డంకుల వల్ల తాత్కాలిక భవనాల నిర్మాణం వరకు మాత్రమే పరిమితమైంది. నిధుల లోపం, కోర్టుల కేసులు, భూ వ్యవహారాలు తదితర సమస్యలు నిర్మాణాన్ని నిలిపేశాయి. 2019 లో వచ్చిన జగన్ (Jagan) ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టేసి మూడుఅధికారిక రాజధానుల భావనను తీసుకురావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు తిరిగి చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులు న్యాయం జరుగుతుందని ఆశపడుతున్నారు.
కానీ చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి పని జరుగుతోందన్న ఆశలు పెరిగినా, ప్రస్తుతం ఇంకా రాజధానిలో స్పష్టమైన అభివృద్ధి కనిపించకపోవడం ఆ ఆశలను మసకబారుస్తోంది. ప్రభుత్వం నిధుల సమీకరణలో బిజీగా ఉండగా, టెండర్ల ప్రక్రియ మాత్రం నిదానంగా సాగుతోంది. పనులు పట్టాలెక్కే దశలో ఉన్నాయని చెబుతున్నా, వాస్తవ పరిస్థితి మాత్రం వేరేలా కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం 34 వేల ఎకరాల్లోనైనా అభివృద్ధిని ప్రారంభిస్తే రైతుల్లో భరోసా కలిగేది. కానీ మరో 44 వేల ఎకరాల ప్రతిపాదనతో వారి ఆశలు నలుగుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న భూముల్లో హైకోర్టు (High court) , అసెంబ్లీ (Assembly) , సచివాలయం (Sachivalayam) నిర్మాణానికి సరిపోతుందని, రోడ్లు, కాలువలకూ తగిన స్థలం ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్ అవసరాల పేరుతో ఇప్పుడు ఎక్కువ భూములు కోరడం వల్ల జాప్యం తప్పదన్న విమర్శలు వస్తున్నాయి. రైతుల అభిప్రాయాలను బహిరంగంగా తెలియజేయకపోయినా, వారి తరఫున వడ్డే శోభనాదీశ్వరరావు (Vadde Sobhanadreeswara Rao) వంటి నాయకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై రైతుల గల ఆశలు వృథా కాకూడదన్నదే వారి మనసులోని మాట. అందుబాటులో ఉన్న వనరులతో పని ప్రారంభించటం ద్వారా ప్రభుత్వం విశ్వాసం పొందే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.













