జగన్ మాటకు సరేనన్న ఆమంచి..! కొత్త ప్లేస్ కలిసొస్తుందా..?
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని పూర్తిగా కనుమరుగు చేయాలని వైసీపీ తపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలనూ గెలిస్తే టీడీపీ పనైపోయినట్లేనని ఆ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే పకడ్బందీగా వ్యూహాలు రచిస్తున్నారు వైసీపీ అధినేత వై.యస్.జగన్మోహన్ రెడ్డి. ముందుగా టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టారాయన. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తే టీడీపీని ఓడించినట్లేనని జగన్ భావిస్తున్నారు. అలాగే టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడ బలమైన నేతలను ఇన్ ఛార్జ్ లుగా పెట్టి ఇప్పటి నుంచే పకడ్బందా ప్లాన్ తో ముందుకెళ్లాలనుకుంటున్నారు జగన్. అలాంటి నియోజకవర్గాల్లో ముందుంది బాపట్ల జిల్లాలోని పర్చూరు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్చూరు టీడీపీకి కంచుకోటగా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలుగుదేశం పార్టీని సమర్థంగా ముందుకు నడిపిస్తున్నారు. మొదటిసారి 2014లో అసెంబ్లీ బరిలోకి దిగిన సాంబశివరావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019లో వైసీపీ వేవ్ లో కూడా ఆ పార్టీని ఎదుర్కొని రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఏలూరి సాంబశివరావు సత్తా ఏంటో అందరికీ తెలిసొచ్చింది. ఏలూరి సాంబశివరావు వ్యాపారవేత్తగానే కాదు.. సామాజిక సేవలోనూ ముందుంటున్నారు. స్థానికంగా తన స్వచ్చంధ సంస్థల ద్వారా సేవ చేస్తున్నారు. ఇది ఆయనపై స్థానికుల్లో నమ్మకాన్ని నిలబెట్టింది. అందుకే ప్రజలు ఆయనకు మద్దతుగా ఉంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయనకు తిరుగుండదని సర్వేలు సూచిస్తున్నాయి.
అందుకే పర్చూరులో బలమైన అభ్యర్థికోసం వెతుకుతున్నారు వైసీపీ అధినేత జగన్. గతంలో రావి రామనాథం వైసీపీ తరపున బరిలోకి దిగారు. ఏలూరి చేతిలో ఓడిపోయారు. అయితే ఈసారి కూడా రావి రామనాథం తట్టుకోలేరని అంచనాకు వచ్చిన జగన్.. ఇక్కడి నుంచి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ను బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఏలూరి సాంబశివరావు లాంటి బలమైన నేతను ఎదుర్కోవాలంటే వ్యూహాల్లో దిట్ట అయిన ఆమంచే కరెక్ట్ అని జగన్ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో చీరాల నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్.. టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపాయారు. అయితే.. ఆ తర్వాత కరణం బలరాం వైసీపీ గూటికి చేరారు. వచ్చే ఎన్నికల్లో కూడా చీరాల నుంచే కరణం బలరాం లేదా ఆయన కుమారుడు బరిలోకి దిగనున్నారు. దీంతో ఆమంచి కృష్ణమోహన్ నియోజకవర్గం మారక తప్పని పరిస్థితి ఏర్పడింది. పర్చూరు నుంచి పోటీ చేయాలని ఆమంచికి జగన్ సూచించారు. అయితే పర్చూరు వెళ్లాలా.. వద్దా అనే అంశంపై తీవ్ర తర్జనభర్జన పడ్డారు ఆమంచి కృష్ణమోహన్.
అయితే పర్చూరు నుంచి బరిలోకి దిగేందుకు ఆమంచి కృష్ణమోహన్ సిద్ధమయ్యారు. ఇటీవల వేటపాలంలో అనుచరులతో సుదీర్ఘ చర్చలు జరిపారు ఆమంచి. ఇన్నాళ్లూ అటుఇటు ఊగిసలాడిన ఆమంచి.. ఇప్పుడు తాను సిద్ధమని వైసీపీ అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. అయితే తన నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకోకూడదని షరతు పెట్టినట్టు తెలుస్తోంది. ఇందుకు హైకమాండ్ ఓకే చెప్పడంతో పర్చూరు కేంద్రంగా ఇక పాలిటిక్స్ చేసేందుకు ఆమంచి సిద్ధమయ్యారు. ఈ మేరకు పర్చూరులోని పలు సెంటర్లలో ఆమంచికి స్వాగతం చెబుతూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో ఆమంచి రాక ఖాయమైందని స్థానికులు భావిస్తున్నారు. అయితే రావి రామనాథం ఏం చేస్తారు.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. తాజాగా జరిగిన నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల మీటింగ్ కు కడా ఆయన అటెండ్ అయ్యారు. ఇప్పుడు ఆమంచి రాకతో.. ఇన్నాళ్లూ పార్టీని నమ్ముకుని పని చేసిన తన భవిష్యత్ ఏంటనేది రావి రామనాథం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి హైకమాండ్ ఆయనకు ఏం చెప్తుందనేది చూడాలి.













