మహానాడుకు ఘనంగా ఏర్పాట్లు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు, టీడీపీ మహానాడును తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే మహానాడుకు ఇక్కడి వేమగిరి సమీపంలో జాతీయరహదారికి ఆనుకుని 50 ఎకరాల్లో పనులు జరుగుతున్నాయి. సభ, ప్రాంగణ పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పర్యవేక్షణలో యంత్రాలతో చదును చేశారు. పరి సరాల్లో భారీ కటౌట్లు ఏర్పాటవుతున్నాయి. 27న ప్రతి నిధుల సదస్సుకు వేదిక సమీపంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేశారు. ప్రతినిధుల సభకు 15 వేల మంది, మహానాడుకు 15 లక్షల మంది వస్తారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
భోజన ఏర్పాట్లపై మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు సమావేశమయ్యారు. ఎన్ని లక్షల మంది వచ్చినా గోదావరి రుచులు, ఆతిథ్యం రుచి చూపిస్తామన్నారు. తొలి రోజు ప్లీనరీకి ప్రతినిధులతో పాటు మరో 50 వేల మంది వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆ రోజు లక్ష మందికి భోజన ఏర్పాట్లకు నిర్ణయించారు. నగర సుందరీకరణకు ఆదిరెడ్డి శ్రీనివాస్ ( వాసు), గన్ని కృష్ణ, వేణుగోపాలరావు తదితరుల నేతృత్వంలో చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. సభాస్థలికి గరిష్ఠంగా 1.50 కి.మీ. పరిధిలో 12 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.













