Advisors: కూటమి ప్రభుత్వంలోనూ సలహాదారులు.. అవసరమా?
అధికారం మారినా పద్ధతులు మారలేదు.. ప్రభుత్వాలు మారినా సలహాల సంస్కృతి పోలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో, సచివాలయ పరిసరాల్లో వినిపిస్తున్న ప్రధాన చర్చ ఇది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సలహాదారుల వ్యవస్థపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన తెలుగుదేశం పార్టీ, నేడు అధికారంలోకి వచ్చాక అదే బాటలో పయనిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం ముగ్గురు ప్రముఖులను సలహాదారులుగా నియమించడంతో ఈ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్, ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు, చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్లను వివిధ విభాగాలకు సలహాదారులుగా నియమించింది. వీరిలో శ్రీధర్, మంతెన సత్యనారాయణరాజు తమ తమ రంగాల్లో లబ్ధప్రతిష్టులే అయినప్పటికీ, ప్రభుత్వ పాలనలో వీరి పాత్ర ఎంతవరకు అవసరం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సలహాదారుల నియామకం ఒక ప్రహసనంగా మారిందన్నది బహిరంగ రహస్యం. దాదాపు ప్రభుత్వంలోని ప్రతి శాఖకు, ఉప శాఖకు కూడా సలహాదారులను నియమించి, వారికి క్యాబినెట్ ర్యాంకులు, భారీ జీతభత్యాలు, వాహనాలు, సిబ్బందిని సమకూర్చడంపై అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అది “సలహాదారుల ప్రభుత్వం” అని, ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారని నాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా కూటమి నేతలంతా దుయ్యబట్టారు. “మేము అధికారంలోకి వస్తే ఈ సలహాదారుల వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం” అని హామీ ఇచ్చారు. కానీ, నేడు కూటమి ప్రభుత్వం కూడా విడతలవారీగా సలహాదారులను నియమించుకుంటూ వెళ్తుండటంతో, అప్పుడు తప్పు అయినది, ఇప్పుడు ఒప్పు ఎలా అవుతుంది? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
ఈ సలహాదారుల నియామకాల్లో వినిపించే ప్రధానమైన, సాంకేతికమైన అభ్యంతరం.. బ్యూరోక్రసీకి సంబంధించింది. అత్యంత కఠినమైన పరీక్షల్లో నెగ్గి, దశాబ్దాల తరబడి పాలనా అనుభవం ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్-1 అధికారులు ప్రభుత్వ యంత్రాంగంలో అందుబాటులో ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి సెక్షన్ ఆఫీసర్ వరకూ వేల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయడానికి ఈ వ్యవస్థ సరిపోదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అనుభవజ్ఞులైన అధికారులు ఉండగా, బాహ్య వ్యక్తులను సలహాదారులుగా తీసుకురావడం వల్ల అధికారుల మనోధైర్యం దెబ్బతింటుందనే వాదన కూడా ఉంది. ఒకవేళ సలహాలు నిజంగా అవసరమైతే, ఆయా రంగాల నిపుణులతో తాత్కాలిక కమిటీలు వేయవచ్చు కానీ, పూర్తిస్థాయి పదవులు ఎందుకనేది మేధావుల ప్రశ్న.
ఈ నియామకాల వెనుక రాజకీయ ఉపాధి కోణం ఉందన్న విమర్శలను కొట్టిపారేయలేం. ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని నాయకులకు, పార్టీ కోసం కష్టపడిన సానుభూతిపరులకు, సోషల్ మీడియాలో మద్దతుగా నిలిచిన వారికి ఏదో ఒక హోదా కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ పదవులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వం తమ పార్టీ వారిని ఎలాగైతే అకాడమీల చైర్మన్లుగా, సలహాదారులుగా నియమించిందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా తమ మద్దతుదారులను తృప్తి పరచడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఇది కేవలం రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పథకంలా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే రాష్ట్రం తీవ్ర ఆర్థిక లోటులో ఉందని, అప్పుల కుప్పగా మారిందని ప్రభుత్వ పెద్దలే శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో.. సలహాదారుల జీతభత్యాలు, వారి కార్యాలయాల నిర్వహణ, వసతుల కల్పన ఖజానాపై అనవసరమైన భారాన్ని మోపుతాయి. ఒక్కో సలహాదారుడి నిర్వహణకు నెలకు లక్షల్లో ఖర్చు అవుతుంది. పొదుపు చర్యలు పాటించాల్సిన ప్రభుత్వమే ఇలా ఆర్భాటాలకు పోవడం ఎంతవరకు సమంజసం అనే చర్చ సామాన్యుల్లోనూ జరుగుతోంది.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి నిపుణుల సలహాలు అవసరమే. కానీ అవి పాలనను మెరుగుపరిచేవిగా ఉండాలి తప్ప, రాజకీయ అవసరాలు తీర్చేవిగా ఉండకూడదు. కార్టూనిస్టులు, ప్రకృతి వైద్యులు సమాజానికి అవసరమే కానీ, వారి సేవలను ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో ఎలా వినియోగించుకుంటారో, తద్వారా సామాన్యుడికి ఏం మేలు జరుగుతుందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే, గత ప్రభుత్వం చేసిన తప్పునే ఈ ప్రభుత్వం కూడా చేస్తోందన్న అపవాదును కూటమి సర్కార్ మూటగట్టుకోక తప్పదు.






