కొత్త పార్టీ స్థాపించిన కొత్తపల్లి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది. విశాఖ జిల్లాకు చెందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత జన జాగృతి పార్టీని స్థాపించారు. మార్పు కోసం ముందడుగు అనేది పార్టీ నినాదమని ఆమె తెలిపారు. పార్టీ జెండాను కూడా ఆమె విడుదల చేశారు. నీలం రంగు, తెలుగు రంగుతో కూడిన జెండాపై గొడుగు చిహ్నాన్ని ముద్రించారు. ఈ సందర్భంగా ఆమె ప్రతిపక్ష నేత జగన్పై విమర్శలు గుప్పించారు. జగన్ అసెంబ్లీకి వెళ్లరని, సమస్యలు ప్రస్తావించరని విమర్శించారు. తాను డిప్యూటీ కలెక్టర్గా పనిచేశానని, నాలుగున్నరేళ్లు ఎంపీగా ఉన్నానని, విద్యార్ధి దశ నుంచే సామాజిక స్పృహతో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. గిరిజన ప్రాంత సమస్యల్ని పార్లమెంట్లో ప్రస్తావించానని అన్నారు. రాజకీయ పార్టీలున్నది ప్రజల కోసమేనని ఆమె తెలిపారు. కులాధిపత్యంతోనే రాష్ట్రంలో పాలన సాగుతోందని ఆరోపించారు. జనజాగృతి పార్టీ మహిళలకు 33 శాతం సీట్లను కేటాయిస్తుందని ఆమె సృష్టం చేశారు. ఆర్నెల్లకు ఓసారి ఎమ్మెల్యేలపై సామాజిక ఆడిట్ చేయిస్తామని తెలిపారు.













