ఏపీ మంత్రివర్గంలోకి కిడారి శ్రావణ్!
ఇటీవల మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు పెద్ద కుమారుడు శ్రావణ్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. ఐఐటీ నుంచి ఇంజనీరింగ్ చదివిన శ్రావణ్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని కీలక శాఖ అప్పగిస్తే, ప్రజల్లోకి ప్రత్యేకించి గిరిజనుల్లోకి మంచి సంకేతాలు వెళతాయని ఆయన ఆలోచిస్తున్నారు. గిరిజనులకు మంత్రివర్గంలో అవకాశమివ్వలేదనే విమర్శ తొలగిపోవటంతోపాటు రాజకీయంగానూ సానుకూలత ఏర్పడుతుందని టీడీపీ వర్గాల అంచానా.
శ్రావణ్‌కుమార్‌ను కూడా మంత్రివర్గంలో అవకాశమిస్తే గిరిజన వర్గాల నుంచి ఆదరణ లభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అన్నీ అనుకూలిస్తే ఈ అక్టోబరులోనే మంత్రివర్గ విస్తరణ జరగొచ్చు. శాసనసభ, మండలిలో ఎందులోనూ ఆయన సభ్యుడు కాదు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే ఆరునెలల్లోగా ఏదో ఒక సభకు ఎన్నికవాలి. ఆలోగా శాసనసభకు సాధారణ ఎన్నికలే రానున్నాయి. ఇప్పటికిప్పుడు అరకు స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశమూ లేదు. ముందు శ్రావణ్‌ని మంత్రిగా తీసుకుంటే, ఆ తరువాత అవకాశముంటే శాసనమండలికి ఎన్నికయ్యేలా చూడటం, లేదంటే ఆరు నెలల సమయం ముగిశాక రాజీనామా చేయించి సాధారణ ఎన్నికల్లో అరకు నుంచి పోటీ చేయించటం అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.













