పత్రికాధిపతి మీరు.. పాత్రికేయులను పట్టించుకోరా? జగన్పై జర్నలిస్టుల ధ్వజం
కరోనా వైరస్ సోకి విధినిర్వహణలో ఉన్న జర్నలిస్టులు మృత్యువాత పడుతున్నారని మరోపక్క వందలాది మంది జర్నలిస్టులు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎక్స్ గ్రేషియా ప్రకటించకపోతే రెండో దశ ఆందోళనకు జర్నలిస్టులు సిద్ధం అవుతామని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ. వి సుబ్బారావు హెచ్చరించారు. శుక్రవారం ఒంగోలులోని ప్రెస్ క్లబ్ రామారావు మృతికి ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఐ.వి సుబ్బారావు మాట్లాడుతూ కరోనా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను కరోనా వారియర్స్ గా గుర్తించాలని డిమాండ్ చేశారు జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. జర్నలిస్టుల భద్రత ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు సమాజహితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టు కరోనా సోకి మృతి చెందటం బాధాకరమని, ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం పత్రికా యాజమాన్యాలు జర్నలిస్టులకు భద్రతా పరికరాలు అందించాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల హెల్త్ పాలసీని రెన్యువల్ చేయాలని, మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో మొదటి దశ ఆందోళన చేస్తామని అప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే రెండో దశ పోరాటానికి సిద్ధం అవుతామని స్పష్టం చేశారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాల పట్ల సానుకూలంగా స్పందిస్తారని మరి జర్నలిస్టుల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. స్వయంగా తానే ఒక పత్రిక అధిపతిగా, జర్నలిస్టుల సమస్యల పట్ల మరింత సానుకూలంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలియడం లేదన్నారు. యాజమాన్యాలు వేరు, జర్నలిస్టు వేరు, ఇద్దరిని ఒకే గాటన కట్టడం మంచి పద్ధతి కాదన్నారు.
ఇప్పటికైనా తమ సమస్యల పట్ల తక్షణమే ప్రకటన చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేయకతప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో లో కరోనా సోకి మృతి చెందిన జర్నలిస్టులకు ఘన నివాళి అర్పించారు వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి కనకయ్య, యూనియన్ నాయకులు ఫైరోజ్, జనార్ధన్ , ప్రసాద్ ,శంకర్,జయరాజు, ఎంసీఏ అధ్యక్షులు భాషా, తదితరులు పాల్గొన్నారు.













