కేరళ వరద బాధితులకు గిడ్డంగుల సంస్థ ఉద్యోగుల విరాళం
ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు
సాటివారి కష్టానికి స్పందించి ఆదుకోవటంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ ముందుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేరళలో వరద బాధితులకు రాష్ట్ర ఉద్యోగుల సంఘీభావం స్ఫూర్తిదాయకమని చెప్పారు.
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఉద్యోగులు తమ ఒక్కరోజు వేతనం రూ.4,55,795 ను విరాళంగా అందజేసినందుకు వారిని ముఖ్యమంత్రి అభినందించారు. సంస్థ చైర్మన్ ఎల్.వి.ఎస్.ఆర్.కె ప్రసాద్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఎండి, ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలు చంద్రశేఖర్, కృష్ణ కుమార్, ఎం. శ్రీనివాసరావు తదితరులు ముఖ్యమంత్రిని కలసి ఈ చెక్ ను అందజేశారు.
చంద్రబాబు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో ఉద్యోగులు ధనరూపేణా కాకుండా వస్తురూపేణా కూడా సహాయం చేశారన్నారు. వరదలకు గురై కేరళలో కొన్ని వారాలపాటు జనజీవనం స్తంభించి పోయిందని, ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10 కోట్లు అందజేసిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. తన విజ్ఞప్తికి స్పందించిన రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులు విరాళంగా అందజేసిన నగదు, ప్రభుత్వం అందించిన సహాయ వస్తు సామగ్రి, వివిధ జిల్లాలు, సంస్థల నుంచి రూ.40.148 కోట్ల విలువైన సాయం అందిందని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తమకు లేఖ రాశారని చంద్రబాబు చెప్పారు. ఏపీ ప్రజలు, ఉద్యోగుల స్పందనను కేరళ ముఖ్యమంత్రి కొనియాడుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారని చంద్రబాబు తెలిపారు. సాటి భారతీయులుగా మన స్పందనకు గర్విస్తున్నట్లు విజయన్ తమకు రాసిన లేఖలో పేర్నొన్నారని గుర్తు చేశారు. దేశపౌరులు కష్టాల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ గతంలో కూడా స్పందించిందని, ఒరిస్సాలో వరదలు వచ్చినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయకముందే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏపీ నుంచి సహాయక బృందాలను పంపి అండగా నిలిచిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.
ఒకరోజు వేతనం విరాళంగా అందజేసిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ ఎల్ విఎస్ ఆర్ కె ప్రసాద్ ను, సంస్థ ఉద్యోగులను మరొక్కసారి మన:స్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు ముఖ్యమంత్రి అన్నారు.













