కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం సీఎంకు లేదు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్న మూడు రాజధానుల ఆలోచన రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడదని పీసీసీ అధ్యక్షుడు సాకే శైజానాథ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడు నెలల పాలనలోనే జగన్ తీవ్రమైన ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకహోదా ఒక్కటే మార్గమని, మూడు రాజధానులు కాదని అభిప్రాయపడ్డారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పే జగన్ ప్రత్యేక హోదా కోసం 22 మంది వైకాపా ఎంపీలతో ఎందుకు లోక్‌సభను స్తంభింపజేయడం లేదని ప్రశ్శించారు. కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం సీఎంకు లేదన్నారు. సీఏఏ, ఎన్ఆర్సీను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.













