ఎన్ఆర్టీ ఐకాన్ టవర్ కట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమే
ఎన్ఆర్టీ ఐకాన్ టవర్ ప్రాజెక్టును కొనసాగించేందుకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం ముందు నుంచీ సంసిద్ధంగా ఉన్నా పెట్టుబడిదారులే వైదొలిగారని ఆంధప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) సీఈవో దినేశ్‌కుమార్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఎన్ఆర్టీ ఐకాన్ టవర్ ప్రాజెక్టుపై ఏపీఎన్ఆర్టీఎస్ సీఈవో ఒక ప్రకటన విడుదల చేశారు. అమరావతిలోని ఎన్ఆర్టీ సహా అన్ని ప్రాజెక్టులపైనా రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా సమీక్ష జరిపింది. ఎన్ఆర్టీ ఐకాన్ ప్రాజెక్టును యథాతధంగా అమలు చేయడానికే ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.
2019 జూన్, నవంబరు మధ్య పెట్టుబడిదారులతో క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేశాం అన్నారు. ప్రాజెక్టు పనుల పురోగతి, వివిధ అనుమతుల వివరాలను ఎప్పటికప్పుడు తెలిపాం. ఈ ప్రాజెక్టులో కొనసాగేందుకు తొలుత పెట్టుబడిదారులు సుముఖంగానే ఉన్నారు. కొంతకాలం తర్వాత 85 శాతం మంది ప్రాజెక్టు నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ముందు ప్రతిపాదించిన ప్రకారమే ప్రాజెక్టును కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎన్ఆర్టీఎస్ సుముఖంగా ఉన్నప్పటికే వారు నిరాసక్తత తెలిపారు. భూమి కొనుగోలు, అనుమతులు, కన్సల్టెంట్లు, ప్రారంభోత్సవం, కార్యక్రమాలకు గత ప్రభుత్వం చాలా ఖర్చు చేసింది. ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ ఏపీఎన్ఆర్టీఎస్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు అని దినేశ్‌కుమార్ పేర్కొన్నారు.













