అమరావతి అభివృద్ధికి రూ.200 కోట్లు
రూ.3940 కోట్ల పీఆర్సీ బకాయిలను ఒకేసారి విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మనసులు గెలుచుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏపీఎన్జీఓ సంఘాల నేతలు అభినందించారు. సచివాలయంలో ఏపీఎన్జీఓ నాయకులు అశోక్‌బాబు, విద్యాసాగర్, సుధీర్‌బాబు, హృదయరాజు, రత్నకుమారి, లలితాంబ, జానకి ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ, గత 50 సంవత్సరాల్లో ఇంత పెద్ద మొత్తంలో పీఆర్సీ బకాయిలు చెల్లించిన దాఖలాలే లేవని, ప్రభుత్వానికి ఎంత భారమైనా ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.
4 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, 4 లక్షల మంది పెన్షనర్లు మొత్తం 8 లక్షల మందికి ఈ నిర్ణయం వల్ల లబ్ది కలిగిందని పేర్కొన్నారు. ఒక్కొక్క ఉద్యోగి రూ.80వేల నుంచి లక్ష వరకు ప్రయోజనం పొందగలుగుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాలువ, పుష్పగుచ్ఛాలతో నేతలు ముఖ్యమంత్రిని సత్కరించారు. ఇంకా కష్టపడి పని చేసి రెండంకెల సుస్థిర వృద్ధి సాధనకు తోడ్పడాలని ఉద్యోగ సంఘాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లిస్తున్న బకాయిలలో రూ.200 కోట్లను తిరిగి ప్రభుత్వానికి అమరావతి అభివృద్ధికి చెల్లిస్తున్నట్లు ఏపీఎన్జీఓ నేత అశోక్ బాబు ప్రకటించారు. ఈ నిధులతో నిర్మించే భవానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు పెట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయని ముఖ్యమంత్రికి తెలిపారు.













