AP Volunteers: అప్పుడు జగనన్న సైనికులు.. ఇప్పుడు వైసీపీకి శత్రువులు..

వలంటీర్ల (Volunteers) అంశం ఏపీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ప్రజలతో ప్రభుత్వాన్ని కలిపే వారధిలా పనిచేసిన వలంటీర్లు ఇప్పుడు పూర్తిగా వైసీపీ (YCP)పై విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవస్థను ప్రవేశపెట్టింది కూడా అదే పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కావడం విశేషం. 2019లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారు. ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు, పెన్షన్లు, సంక్షేమ కార్యక్రమాలు అందించే బాధ్యతను వారికి అప్పగించారు. మొదట్లో ఈ విధానం ప్రజలకి దగ్గర కావడమే కాకుండా పార్టీకి కూడా లాభపడుతుందని జగన్ భావించారు.
అయితే ఆలోచించినంత ఫలితం రాలేదు. వాస్తవానికి వలంటీర్లు ఎన్నికల్లో ఊహించని మలుపు తీసుకుని వైసీపీకి ప్రతికూలంగా వ్యవహరించారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. దాంతో ఆ పార్టీ అంచనాలను తారుమారు చేస్తూ ఓటమిని చవిచూసింది. ఒకవైపు వలంటీర్లపై ఆధారపడటం వల్ల నాయకులు, కార్యకర్తలు, ప్రజల మధ్య నేరుగా సంబంధాలు తగ్గాయని కూడా అప్పటి విమర్శలు వచ్చాయి.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వలంటీర్లకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని మాట ఇచ్చినా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను పునరుద్ధరించలేదు. దీంతో వలంటీర్లు కొంతకాలం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేశారు. కానీ పెద్దగా స్పందన రాక సైలెంట్ అయ్యారు. తమ ఉపాధి అవకాశాలను ప్రభుత్వం దూరం చేసిందని వాదించారు.
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఒక ఇంటర్వ్యూలో ఈ వివాదంపై స్పందించారు. వైసీపీ నాయకులే వలంటీర్ల వ్యవస్థ లేకుండా పింఛన్లు, పథకాలు అందజేయలేమని శపథం చేశారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ విధానం లేకుండానే అన్ని పనులు విజయవంతంగా చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పెన్షన్లు, పథకాలు నేరుగా ప్రజల ఇంటికే చేరుతున్నాయని చెబుతూ వలంటీర్ల అవసరం లేకుండా పనులు సాఫీగా సాగుతున్నాయని వివరించారు.
ఈ వ్యాఖ్యలతో వలంటీర్లకు అసలు విషయం స్పష్టమైంది. తాము ఉద్యోగాలు కోల్పోవడానికి నిజానికి కారణం వైసీపీ చేసిన నిర్ణయమేనని ఇప్పుడు వారు గుర్తించారు. దీంతో జగన్ (Jagan)పై అసహనం వ్యక్తం చేస్తూ, తమ ఉపాధికి గండిపెట్టిన పార్టీని మళ్లీ నమ్మలేమని వ్యాఖ్యానిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వలంటీర్లను పక్కన పెట్టినా, తమ స్థితికి కారణం వైసీపీనే అని వారు బహిరంగంగా చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో వలంటీర్ల ఆగ్రహం వైసీపీకి మరో పెద్ద నష్టంగా మారింది. ప్రజల్లో ఇప్పటికే ఎదురవుతున్న ప్రతికూలతలతో పాటు, వలంటీర్ల వ్యతిరేక భావన కూడా ఆ పార్టీకి భారమవుతోంది. ఒకప్పుడు విజయం తెస్తుందని జగన్ నమ్మిన ఈ వ్యవస్థ ఇప్పుడు విరుద్ధంగా ఆయన పార్టీకి మైనస్‌గా మారడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.