Pawan Kalyan: పవన్ వ్యాఖ్యలపై పోరాటం మళ్లీ మొదలు ..హైకోర్టులో వాలంటీర్ల పిటిషన్..

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవహారం మరోసారి చర్చకు కేంద్రంగా మారింది. గతంలో జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వరాహి యాత్ర సమయంలో చేసిన ఆరోపణలు—వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో నియమించిన వాలంటీర్లు (Volunteers) సేకరించిన వ్యక్తిగత సమాచారం కారణంగా సుమారు 30,000 యువతులు అదృశ్యమయ్యారని—తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారం మళ్లీ హైకోర్టు దృష్టికి చేరింది.
ఈ వ్యాఖ్యలపై గతంలో వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, తమ పరువు దిగజారేలా చేశారని పేర్కొంటూ గుంటూరు (Guntur) కోర్టులో పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. కానీ, గత సంవత్సరం నవంబర్‌లో నాటి ప్రభుత్వం ఆ కేసును వెనక్కి తీసుకుంది. దీంతో, వాలంటీర్లు హైకోర్టును ఆశ్రయించారు. మొదటగా రిజిస్ట్రీ వారు వారి పిటిషన్‌కు నంబర్ కేటాయించలేదు. ఈ నేపథ్యంలో నేరుగా న్యాయమూర్తిని కలిసిన వాలంటీర్లకు ఆ తర్వాత నంబర్ కేటాయించబడింది.
ఇప్పుడు హైకోర్టు (High Court) ఈ కేసును తిరిగి విచారించేందుకు సిద్ధమవుతోంది. రేపు ఉదయం 10:30 గంటలకు ఈ పిటిషన్‌ను తీసుకుని విచారణ జరపనున్నట్లు సమాచారం. ఇది పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణానికి చాలా కీలక ఘట్టంగా మారే అవకాశం ఉంది. ఆయన చేసిన ఆరోపణలకు ఏవైనా ఆధారాలు ఉన్నాయా? లేక ఏ ఆధారాలు లేకుండానే మౌఖిక వ్యాఖ్యల ఆధారంగా ఇదంతా జరిగింది అనే అంశాలపై హైకోర్టు స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.
ఇక ఆధారాలు లేకపోతే పవన్‌కు న్యాయపరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలూ ఉన్నాయనేది న్యాయవాదుల అభిప్రాయం.అప్పట్లో వాలంటీర్లపై వచ్చిన విమర్శలపై ప్రభుత్వం ఎందుకు కేసును ఉపసంహరించుకుంది? అనే అంశంపై కూడా కూటమి ప్రభుత్వం హైకోర్టులో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సరైన కారణాలు చూపించలేకపోతే, హైకోర్టు ఈ కేసును తిరిగి విచారించేందుకు పూర్తి అవకాశం ఇవ్వవచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్, జనసేన (Jana Sena), అలాగే కూటమి ప్రభుత్వానికి ఇది పరీక్షగా మారబోతోంది. తదుపరి రాజకీయ పరిణామాలపై ఈ కేసు ప్రభావం చూపకమానదని విశ్లేషకులు భావిస్తున్నారు.