Kandula Durgesh: ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు..
తెలుగు టైమ్స్ ఇంటర్వ్యూలో రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, అలాగే సాంస్కృతిక, సినిమా రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) అన్నారు. ఏపీ పర్యాటకం పెట్టుబడులకు అనుకూలమని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఆలోచనలు పంచుకుని పెట్టుబడులతో వస్తే భరోసా కల్పించే బాధ్యత తమదని అంటూ, రాష్ట్ర పర్యాటకరంగంలో ప్రెవేటు భాగస్వామ్యానికి, పెట్టుబడులకు తమ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోందని, ఇందుకు అనుగుణంగా రాష్ట్ర టూరిజం పాలసీని కూడా విడుదల చేశామని తెలిపారు. 2047 నాటికి రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తెలుగు టైమ్స్‌కు ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలను తెలియజేశారు. పర్యాటక రంగాన్ని పారిశ్రామికంగా తీర్చిదిద్దుతూ, పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుకూల వాతావరణం సృష్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకరంగం అభివృద్ధికోసం తీసుకున్న చర్యలను వివరించారు.
రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి తీసుకున్న చర్యలేమిటి?
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర పర్యాటక రంగాన్ని నూతనంగా అభివృద్ధి చేసే దిశగా ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలపై విస్తృత ప్రచారం కోసం హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ముంబయిలలో రోడ్ షోలు చేయనున్నాము. అలాగే అఖండ గోదావరి, గండికోట, సూర్యలంక బీచ్ వంటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాము. అమరావతిలో పర్యాటక భవన్ ఏర్పాటు, బుద్ధిస్ట్ సర్క్యూట్, దేవాలయాల అభివృద్ధికి కేంద్ర పథకాల నుంచి నిధుల వినియోగం, లేపాక్షి, లంబసింగి, సింహాచలం, అన్నవరం వంటి ప్రాధాన్యత గల ప్రదేశాలపై ప్రత్యేక దృష్టిని పెట్టాము. అలాగే హోం స్టే, క్యారవాన్, టెంట్ సిటీ విధానాల అమలుతోపాటు ఈసారి ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సూర్యలంక బీచ్ లో ఘనంగా నిర్వహించాలన్న యోచన కూడా చేస్తున్నాము.
రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా అడ్వెంచర్, ఎకో, విలేజ్, వెల్ నెస్ , అగ్రి, బీచ్, హెరిటేజ్, టెంపుల్ తో పాటు క్రూయిస్, కల్చరల్ టూరిజం తరహా పర్యాటక విధానాలు నెలకొల్పాలని భావిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సహజ సిద్ధమైన అందాలను, చారిత్రక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయడంతోపాటు పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు, ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు కూడా చర్యలు చేపట్టాము.
పర్యాటకుల కోసం ఏఏ ఏర్పాట్లు చేస్తున్నారు?
రాష్ట్రంలో పర్యటించే పర్యాటకులకోసం వివిధ చర్యలను చేపట్టాము. ముందుగా వారికి అవసరమైన వసతి సౌకర్యాలపై దృష్టి పెట్టాము. ఇందులో భాగంగా 50,000 హోటళ్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. విశాఖపట్టణం, తిరుపతి, అరకు వ్యాలీ, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, గండికోట ప్రాంతాల్లో యాంకర్ హబ్ లు ఏర్పాటు, పర్యాటక ప్రాంతంలో పర్యాటకులు ఐదు రోజులు ఉండే విధంగా టూరిజం సర్క్యూట్ ల ఏర్పాటు, 25కు పైగా థీమాటిక్ సర్క్యూట్ లు.. అందులో 2 బుద్దిస్ట్ సర్క్యూట్ లు, 10 టెంపుల్ సర్క్యూట్ లు, 5 బీచ్ సర్క్యూట్ లు, 4 రివర్ క్రూయిజ్ సర్క్యూట్లు, 3 ఎకో టూరిజం సర్క్యూట్లు, 2సీ క్రూయిజ్ సర్క్యూట్లు, సీప్లేన్ సర్క్యూట్లు ఏర్పాటు చేసి పర్యాటకులకు కనువిందు చేయనున్నాము.
రాష్ట్రంలో 40 బౌద్ధ స్మారక చిహ్నాలు, చారిత్రక మహాయాన బౌద్ధ మతం జన్మస్థలంగా ప్రాముఖ్యత, గొప్ప బౌద్ద వారసత్వం, చారిత్రక, పురావస్తు అభివృద్ధి చేసేందుకు చర్యలు.. అందులో భాగంగా విశాఖపట్టణం, శాలిహుండం, తొట్ల కొండ, బొజ్జన కొండ, అమరావతి స్థూపం, ఉండవల్లి గుహలు, నాగార్జున కొండ తదితర ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నాము.
సినిమారంగం అభివృద్ధికి చేపట్టిన చర్యలేమిటి?
రాష్ట్రంలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి, రాష్ట్రంలో సినిమా నిర్మాణ కార్యకలాపాలు పెంచేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమని ఇప్పటికే సినీవర్గాలకు, ఫెడరేషన్‌కు తెలియజేశాము. సినిమా షూటింగ్‌లకు అనుమతులు సులభతరం చేయడం, సింగిల్ విండో విధానాన్ని మరింత పటిష్టం చేయడం, అలాగే రాష్ట్రంలో ఫిల్మ్ సిటీ నిర్మాణానికి సంబంధించిన అవకాశాలను పరిశీలించి అందుకు అనుగుణమైన చర్యలను చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో సినిమా రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఏపీలో స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, రీ రికార్డింగ్ థియేటర్ లు తదితర మౌలిక వసతుల కల్పనకు ముందుకు రావాలని ఇప్పటికే సంబంధిత వర్గాలను ఆహ్వానించాము.
అలాగే రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంతో పాటు, కళాకారులను ప్రోత్సహించేందుకు కూడా ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాము. ‘మన కళలు, మన భాష, మన సంస్కృతి మన అస్తిత్వానికి ప్రతీకలు. వాటిని పరిరక్షించుకుంటూ భావితరాలకు అందించేందుకు కృషి చేస్తాం. కళాకారులకు తగిన గుర్తింపు, ఆర్థిక చేయూత అందించే దిశగా చర్యలు చేపట్టాము.
ఎన్నారైలకు తెలుగు టైమ్స్ ద్వారా మిరిచ్చే సందేశమేమిటి?
అమెరికాలో 2దశాబ్దాలకు పైగా ఎన్నారై తెలుగువారికి సేవలందిస్తున్న తెలుగు టైమ్స్‌కు అభినందనలు తెలియజేస్తూ, అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు తమ రాష్ట్రంలో ఉన్న పర్యాటక ప్రాంతాల వివరాలను, విశేషాలను అక్కడివారికి వివరించి వారిని రాష్ట్రాన్ని సందర్శించేలా చేయాలని కోరుతున్నాను. రాష్ట్రానికి వాళ్ళే పర్యాటక ప్రచారకర్తలుగా ఉండాలని ఆశిస్తున్నాను.
టూరిజం నూతన పాలసీ ముఖ్యాంశాలు చెబుతారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన పర్యాటక పాలసీ 2024 – 29ని విడుదల చేశాము. రాష్ట్ర పర్యాటకాభివృద్ధిని దృష్టిలో ఉంటుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ పాలసీని రూపొందించాము. ఈ పాలసీ వల్ల పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పనతో రాష్ట్ర పర్యాటకానికి స్థిరమైన అభివృద్ధి లభించనున్నది. పర్యాటకాభివృద్ధి, ఆర్థిక పురోభివృద్ధికి ప్రోత్సాహం, ఉద్యోగాల కల్పన, సాంస్కృతిక మార్పిడి సులభతరం చేసేలా ఈ పాలసీ ఉంటుంది. పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలను 12 శాతం నుంచి 15 శాతానికి పెంపొందించడం, టూరిజానికి సంబంధించి టాప్ 10 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని చేర్చేలా పర్యాటక పాలసీ రూపొందింది. పర్యాటకులకు వసతి సామర్థ్యం పెంచే ప్రక్రియలో భాగంగా హోటళ్లలో గదుల సంఖ్యను 3,500 నుంచి 10,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాము పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ విధానంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, స్థానిక పర్యాటకాన్ని, అక్కడ ఉన్న వారికి ఊపాధికి ఊతమిచ్చేలా చర్యలు తీసుకోవడం వంటివి ఈ పాలసీలో ఉంది. సుస్థిరమైన పర్యాటకాభివృద్ధికి బాటలు వేస్తూ.. పర్యాటక రంగంలో ఉండే వారికి శిక్షణ ఇచ్చి.. వారిలో నైపుణ్యాలు పెంపొందేలా చర్యలు చేపట్టడం, ప్రపంచ స్థాయి అనుభవాలను పర్యాటకులకు అందించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకుల గమ్యస్థానంగా తీర్చిదిద్ది అగ్రస్థానంలో నిలబెట్టేలా ఈ పాలసీ కనిపిస్తుంది. తాము పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం వల్ల ఈ రంగంలో ఉన్నవారికి లాభం చేకూరుతుంది.
పర్యాటక ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ, హెలీ టూరిజంల అభివృద్ధి, పర్యాటకుల కేంద్రంగా ప్రజా రవాణా మెరుగుపర్చడం, ప్రయాణం సాఫీగా సాగేలా నాణ్యత గల హైవేలను అభివృద్ధి చేయడం, రివర్ ఫ్రంట్ ఏరియాను అభివృద్ధి చేయడం, గార్డెన్స్, ఎకో ఫ్రెండ్లీ బోటింగ్ ఏర్పాటు చేయడం, ఎలక్ట్రిక్ బోట్లు ప్రవేశపెట్టడం జల పర్యావరణ వ్యవస్థను కాపాడేందుకు చర్యలు వం. పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయడం.. సరైన నిర్వహణకు చర్యలు చేపట్టనున్నారు. పర్యాటకుల భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పించడం తదితర అంశాలతో పాలసీ రూపకల్పన చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో హైవ్యాల్యూ టూరిజం ప్రాజెక్టులు ఏపీకి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పర్యాటక రంగం విస్తరణకు ప్రభుత్వం కృషి చేయనుంది.







