అమెరికా కూడా మా స్థాయి టెక్నాలజీ వినియోగించలేదు : చంద్రబాబు
పరిపాలనలో అమెరికా కూడా మా స్థాయిలో సాంకేతికను వినియోగించడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించిన ఓపెన్ ఇన్నోవేషన్ హాకథాన్ ముగింపు సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ వినూత్న కార్యక్రమానికి నాంది పలికిందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని మోరీని బర్కిలీ వర్సిటీ స్మార్ట్ గ్రామంగా అభివృద్ధి చేస్తోందని అన్నారు. 5 జిల్లాల్లోని 400 గ్రామాలను స్మార్ట్ గ్రామాలుగా అభివృద్ధి చేయనున్నారని పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లో సంపద పెంపుపై బర్కిలీ వర్సిటీ అధ్యయనం చేస్తోందన్నారు. అమరావతి అత్యుత్తమ ఆవిష్కరణలకు, సాంకేతికతకు కేంద్రమవుతుందని, ప్రభుత్వం కూడా ఇన్నోవేషన్ కేంద్రాలను ప్రోత్సహిస్తోందని అన్నారు. త్వరలోనే డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నామని అన్నారు. అమెరికా వర్శిటీల స్థాయికి ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలను చేరుస్తామన్నారు.













