పచ్చదనంలో ఏపీ టాప్
పచ్చదనం పెంపొందించడం లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రెండో స్థానం, తెలంగాణ ఐదో స్థానం సాధించాయి. ‘స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్-2017’ పేరిట కేంద్ర అటవీ, పర్యావరణశాఖ పరిధిలోని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ ఐ) రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదికను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ సోమవారం విడుదల చేశారు. తాజా నివేదిక ప్రకారం.. 2015-17 మధ్య కాలంలో ఏపీలో 2,141 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది.
1,101 చదరపు కిలోమీటర్లతో కర్ణాటక, 1,043 చ.కి.మీ.తో కేరళ, 885చ.కిమీ.తో ఒడిశా, 565 చ.కి.మీ.తో తెలంగాణ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కాగా, దేశవ్యాప్తంగా ఒక్క శాతం అటవీ విస్తీర్ణం పెరిగింది. 2015తో పోల్చితే దేశంలో 8,021 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్తగా అడవులు చేరాయి. కాగా, ఎఫ్ఎ్సఐ సర్వేలో మన రాష్ట్రం ఈ ఘనత సాధించడం పట్ల అటవీశాఖ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం రెండేళ్ల క్రితం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘వనం-మనం’ ఫలితాన్నిచ్చిందని పీసీసీఎఫ్ మల్లికార్జునరావు పేర్కొన్నారు.













