త్వరలో ఏపీ టెంపుల్స్ యాప్
రాష్ట్రంలో ఉన్న ఆలయాల సమగ్ర సమాచారాన్ని భక్తులకు అందించే ఉద్దేశంతో ఏపీ టెంపుల్స్ మొబైల్ యాప్‌ను తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ నిర్ణయించింది. ఆ శాఖ ఐటి విభాగం అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. జిల్లాలవారీగా ఏయే ఆలయాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? వాటికి ఎలా వెళ్లాలి? ఆలయాల చరిత్ర, విశిష్టత ఏమిటి? అనే సమగ్ర వివరాలు ఇందులో అందుబాటులో ఉంచుతారు. ప్రధాన ఆలయాల్లో దర్శనం, సేవలు బుకింగ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించనున్నారు. భక్తులకు ఇదొక గైడ్‌లా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ-ప్రగతి విధానంలో భాగంగా ఈ యాప్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి ఈ యాప్‌ను ఆవిష్కరిస్తారని తెలిపారు.













