ఎన్నికల ముంగిట.. మరోసారి హార్ట్ టాపిక్ గా మారిన ప్రత్యేక హోదా..
ఆంధ్ర లో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మరొకసారి ప్రత్యేక హోదా అంశం హాట్ టాపిక్ గా మారుతుంది. ఒకపక్క ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు హోదాలో వైయస్ షర్మిల.. కనివిని ఎరుగని రీతిలో జగన్ పార్టీని ఉతికి ఆరేస్తోంది. ఇటు జగన్నే కాక ..అటు మోడీని కూడా విమర్శించడంలో షర్మిల ఏ మాత్రం తగ్గడం లేదు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై పాయింట్ లేవనెత్తడమే కాకుండా ఏపీకి ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్సే రావాలి అని తన స్టైల్ ఆఫ్ స్ట్రాటజీ లో ప్రచారం చేస్తుంది.
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీదే అని ఆమె గ్యారెంటీగా చెబుతోంది. ఇటు వైసిపి నేతలు కూడా షర్మిల విమర్శలకు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే.. ఏపీ మేలు కోరుకొని ఉంటే.. విభజించే సమయంలో ఈ అంశాన్ని విభజన చట్టంలో ఎందుకు చేర్చలేదు చెప్పాలి అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి తాజాగా ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఏపీ ప్రత్యేక హోదా అంశంతో పాటుగా విభజన హామీల గురించి, హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచడం వంటి అంశాల గురించి వై వి సుబ్బారెడ్డి స్పందించారు. వీటన్నిటి గురించి రాజ్యసభలో ప్రస్తావించడమే కాకుండా కేంద్రం మీద ఒత్తిడి కూడా తీసుకు వస్తాము అని ఆయన అన్నారు.. అలాగే వైజాగ్ లో పరిపాలన రాజధాని ఏర్పాటు జరిగేంతవరకు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా కొనసాగించే అంశం గురించి కూడా కేంద్రంతో చర్చిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియపరిచారు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఏపీలో దాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదు అని తన అభిప్రాయాన్ని సుబ్బారెడ్డి వెల్లడించారు. పథకాలు సక్రమంగా అమలు కావాలి అంటే కేంద్రంలో అధికారంతో ఉన్న పార్టీలో సత్సంబంధాలు ఉండడం చాలా అవసరం అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.













