ఏపీ పంచాయతీ ఎన్నికలు రీ షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం రీషెడ్యూల్ చేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దంకాని నేపథ్యంలో గతంలో విడుదల చేసిన షెడ్యూల్లో మార్పులు చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రెండో దశను మొదటి దశగా, మూడో దశను రెండో దశగా, నాలుగో దశను మూడో దశగా, మొదటి దశను నాలుగో దశగా మార్చింది. గత షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. తాజాగా దానిలో మార్పులో చేస్తూ ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మొదటి దశకు ఈ నెల 29 నుంచి, రెండో దశకు ఫిబ్రవరి 2, మూడో దశకు 6, నాలుగో దశకు 10 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపింది.
మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలు వాడుకోవాలని జిల్లా కలెక్టర్లను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఆదేశించారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్‌రాయ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ మేరకు దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేస్తూ ఎన్నికల నిర్వహణకు అనుమతించింది.













