హమ్మయ్య.. ఓ పనైపోయింది..! సెలవు పెట్టిన నిమ్మగడ్డ..!!
నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఈ పేరు తెలియని తెలుగువారుండరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ ఎన్నో సంచలనాలకు కారణమయ్యారనే చెప్పొచ్చు. ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య వార్ కోర్టుల వరకూ వెళ్లింది. అయినా ఎన్నికల సంఘం పరిధిలోకి కోర్టులు జోక్యం చేసుకోకపోవడంతో నిమ్మగడ్డ తన పని తాను చేసుకుపోయారు. ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు అనేక వివాదాలకు, చర్చకు దారితీశాయి. ఇప్పుడు ఆయన అనుకున్న ఎన్నికల నిర్వహణ పూర్తయిపోవడంతో సెలవు పెట్టి విహారానికి వెళ్తున్నారు.
కరోనా సమయంలో నిలిచిపోయిన పంచాయతీ ఎన్నికలను మళ్లీ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ముందుకు రావడంతో ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. వ్యాక్సీన్ సమయంలో అధికారులు, ఉద్యోగులు అందుబాటులో ఉండరని తేల్చి చెప్పింది. దీనిపై కోర్టు గడప తొక్కింది. అయితే కోర్టులు ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకోబోమని తేల్చేసింది. దీంతో ఎన్నికల సంఘం తాను అనుకున్న విధంగా పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేసింది.
ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. తన హయాంలో సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భావించారు. అయితే నిమ్మగడ్డ ఉన్నంతవరకూ ఎలాంటి ఎన్నికలు నిర్వహించుకుండా ఉండాలని ప్రభుత్వం పంతానికి పోయింది. ప్రతి అంశంపైనా కోర్డు గడప తొక్కింది. అంతేకాదు.. ఎన్నికల కమిషనర్ వయో పరిమితిని తగ్గించడం ద్వారా ఆయన్ను పదవి నుంచి తొలగించేసింది. తమిళనాడుకు చెందిన కనగరాజ్ ను తెచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టింది. దీనిపై న్యాయపోరాటం చేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విజయం సాధించారు. చివరకు ఆయన్నే ఈ సీటు వరించింది.
ఆ సీట్లో కూర్చున్న తర్వాత వెంటనే పని ప్రారంభించారు నిమ్మగడ్డ రమేశ్ కుమారు. పెండింగ్ లో ఉండిపోయిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పునరుద్ధరించి పూర్తిచేశారు. ఈ క్రమంలోనే పెండింగ్ లో ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను కూడా పూర్తి చేస్తారని అందరూ భావించారు. ఇవి కూడా పూర్తయితే ఏపీలో ఎన్నికలన్నీ పూర్తియనట్లే. ప్రభుత్వం కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికలను షెడ్యూల్ చేస్తో అభ్యంతరం తెలపకూడదని భావించింది. అయితే ప్రభుత్వం ఊహించినట్లు, అందరూ ఊహించినట్లు ఈ ఎన్నికలు జరగట్లేదు.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సెలవులో వెళ్తున్నారు. ఈ నెల 17 నుంచి 24 వరకూ ఆయన కుటుంబసభ్యులతో అరుణాచల్ ప్రదేశ్ కు వెళ్తున్నారు. 25వ తేదీన తిరిగి వస్తారు. ఈ నెలాఖరుకు అంటే 31వ తేదీన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం పూర్తవుతోంది. దీంతో నిమ్మగడ్డ హయాంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉండే అవకాశం లేదు.













