Paka Venkata SatyaNarayana: దటీజ్ బీజేపీ.. పార్టీని నమ్ముకున్న వ్యక్తికి రాజ్యసభలో చోటు..!!

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి, రాజ్యసభ స్థానానికి ఈ ఏడాది జనవరిలో విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఖాళీ అయిన రాజ్యసభ ఎంపీ (Rajya Sabha MP) స్థానానికి ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతోంది. రేపే నామినేషన్ల దాఖలుకు తుది గడువు. ఈ స్థానం నుంచి అన్నామలై (Annamalai), స్మృతి ఇరానీ (Smriti Irani), మంద కృష్ణ మాదిగ (Manda Krishna Madiga) తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే అనూహ్యంగా ఎవరి అంచనాలకు అందకుండా ఒక సామాన్య కార్యకర్తకు, పార్టీకి సుదీర్ఘ కాలం సేవ చేసిన వ్యక్తికి ఈ అవకాశం దక్కబోతోంది. బీజేపీ నిర్ణయం ఏపీ రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
రాజ్యసభ ఎన్నికలంటేనే పెద్దోళ్లు గుర్తుకొస్తారు. పారిశ్రామిక వేత్తలు, సినిమా సెలబ్రిటీలు, క్రీడాకారులు, కళాకారులు.. డబ్బున్నోళ్లకే ఈ పదవులు దక్కుతూ ఉంటాయి. పార్టీలు కూడా డబ్బులకోసం ఈ పదవులను అమ్ముకుంటాయనే ఆరోపణలున్నాయి. అయితే అన్ని పార్టీలూ అలా ఉండవని నిరూపించింది బీజేపీ. విజయసాయి రెడ్డి స్థానంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి బీసీ నేత పాకా వెంకట సత్యనారాయణను (Paka Venkata Satyanarayana) ఎంపిక చేసింది. ఆయన పేరు అనౌన్స్ చేసే వరకూ కనీసం ఆయన కూడా ఊహించి ఉండకపోవచ్చేమో. ఎందుకంటే పార్టీ ప్రకటించేవరకూ ఆయన కనీసం ప్రాబబుల్స్ జాబితాలో కూడా లేరు.
పాకా వెంకట సత్యనారాయణ.. భీమవరానికి (Bhimavaram) చెందిన బీసీ నేత. 1976లో ఆర్ఎస్ఎస్ (RSS) లో చేరిన ఆయన తర్వాత ABVPకి సేవలందించారు. 1980లో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన పార్టీలోనే కొనసాగుతున్నారు. భీమవరం పట్టణ జనరల్ సెక్రటరీ మొదలు జిల్లా అధ్యక్షుడిగా, అసెంబ్లీ కన్వీనర్ గా, నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదా కన్వీనర్ గా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన పార్టీ క్రమశిక్షణా ఛైర్మన్ గా పనిచేస్తున్నారు.
1981లోనే ఆయన బీజేపీ తరపున భీమవరం కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. నాలుగు సార్లు కౌన్సిలర్ గా ఎన్నికై 20 ఏళ్లపాటు పనిచేశారు. 1987లో మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. దీన్ని బట్టి ఆయన పూర్తిగా భీమవరంకే పరిమితమయ్యారని చెప్పొచ్చు. 1996లో నర్సాపురం పార్లమెంటు నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2006లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2004-06 మధ్య విశాఖ పోర్టు ట్రస్ట్ మెంబర్ గా పనిచేశారు. ఈ పదవులన్నీ చూస్తే ఆయన ఎంతటి సామాన్యుడో అర్థం చేసుకోవచ్చు. కానీ ఎన్ని ఓటములు ఎదురైనా ఆయన పార్టీని వీడలేదు. పార్టీ కోసం నిబద్ధత కలిగిన కార్యకర్తలా పని చేస్తూనే ఉన్నారు.
అందుకే ఇప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా పాకా వెంకట సత్యనారాయణకు రాజ్యసభ ఎంపీగా అవకాశం లభించింది. అన్నామలై,మంద కృష్ణ మాదిగ, స్మృతి ఇరానీ లాంటి హేమాహేమీలను కాదని ఒక సామాన్య బీసీ నేతకు, నిబద్ధత కలిగిన పార్టీ సైనికుడైన పాకా వెంకట సత్యనారాయణను బీజేపీ ఎంపిక చేసింది. బీజేపీ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. పార్టీని నమ్ముకున్న వాళ్లకు బీజేపీలో ఎప్పటికైనా అవకాశాలు లభిస్తాయని నిరూపించిన సందర్భం ఇది.