ప్రివిలేజ్ కమిటీ ముందుకు నిమ్మగడ్డ..? అసలేం జరిగింది..?
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైసీపీ మంచి జోష్ మీదుంది. అయితే ఈ ఎన్నికలు నిర్వహణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు. ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్.. ఇప్పట్లో జరిపేది లేదని రాష్ట్ర ప్రభుత్వం పంతాలకు పోవడంతో ఇష్యూ కోర్టు గడప తొక్కింది. అయితే కోర్టులు ఎన్నికల సంఘానికి అనుకూలంగా తీర్పు చెప్పడంతో ఎన్నికలు సాఫీగా పూర్తయ్యాయి.
గతేడాది జరగాల్సిన పంచాయతీ, మున్సిపల్ కరోనా వల్ల అర్ధాంతరంగా ఆగిపోయాయి. అయితే అప్పట్లో ఎన్నికలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండేది. కానీ ఎన్నికల కమిషనర్ సుముఖత వ్యక్తం చేయలేదు. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టడంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ చర్యలు ప్రారంభించారు. అయితే SECకి సహకరించేందుకు ప్రభుత్వం ససేమిరా అంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీ శాఖ కమిషనర్, కలెక్టర్లు.. లాంటి ఉన్నత ఉద్యోగులు SEC ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో SEC కోర్టును ఆశ్రయించారు. చివరకు కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం సహకరించాల్సి వచ్చింది.
ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ.. తదితరులు పరిధికి మించి మాట్లాడారంటూ గవర్నర్ కు ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. ఎన్నికల కోడ్ ను పెద్దిరెడ్డి ఉల్లంఘించారంటూ ఆయనపై మీడియాతో మాట్లాడకుండా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆంక్షలు విధించారు. వీటిపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి తమ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయంటూ ఫిబ్రవరి 7న స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేశారు. తమ హక్కులకు భంగం కలిగించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. దీన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపించారు స్పీకర్ తమ్మినేని సీతారాం.
మంత్రులు ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించిన ప్రివిలేజ్ కమిటి ఇప్పటికే రెండు దఫాలు ఈ అంశంపై చర్చించింది. తాజాగా ఇవాళ సమావేశమైన ప్రివిలేజ్ కమిటీ.. విచారణ చేపట్టినట్టు ప్రకటించింది. దీనిపై తదుపరి విచారణకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అందుబాటులో ఉండాల్సిందిగా ఆయన కార్యదర్శికి, ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి సమాచారం అందించింది. వాస్తవానికి ఈ నెలాఖరుతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ విరమణ చేయనున్నారు. కానీ ఆయన పదవిలో ఉన్నా లేకున్నా ఈ విచారణ కొనసాగుతుందని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. దీంతో త్వరలోనే ప్రివిలేజ్ కమిటీ ముందుకు నిమ్మగడ్డ హాజరు కావాల్సి ఉంటుంది. రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య తలెత్తిన ఈ సంక్షోభం ఎలాంటి మలుపులు తీసుకుంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది.













